తీరాన్ని తాకిన మొంథా తుఫాన్‌.. గాలి, వానల బీభత్సం.. ఈ ఆరు గంటలు అత్యంత కీలకం..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్‌.. చివరికి అంతర్వేది పాలెం సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన వెంటనే గాలి, వానలు ఉధృతంగా మారాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు చెట్లు, విద్యుత్‌ స్తంభాలను నేలకొరిగాయి. కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. తుఫాన్‌ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, రాబోయే ఆరు గంటలు అత్యంత కీలకం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తీరప్రాంత గ్రామాల్లో గాలి బీభత్సం కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్‌ తీగలు కూలి రాకపోకలకు ఆటంకం కలిగించాయి. మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లకుండా ముందుగానే హెచ్చరికలు ఇవ్వగా, వారంతా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో వందలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.

ప్రజలు ఇంట్లోనే ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పునరావృతంగా విజ్ఞప్తి చేస్తున్నారు. APSDMA కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 425 0101, ద్వారా ఎవరైనా అత్యవసర సహాయం కోరవచ్చని తెలిపారు. ‘మొంథా’ ప్రభావం కారణంగా కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. కృష్ణా జిల్లా బందరు బీచ్ రోడ్‌లో భారీ గాలులు, వర్షాల కారణంగా చెట్లు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. బందరు నుంచి మంగినపూడి బీచ్‌ రోడ్డుపై వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులపై ప్రైవేటు, వాణిజ్య వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వర్తిస్తుంది. అత్యవసర వైద్య సేవలు తప్ప మిగతా వాహనాలన్నీ రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల ప్రకారం రాబోయే గంటల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను విడిచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.