ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ లు దూకుడుమీదుంటే… బీజేపీ ఇంకా అపసోపాలు పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు.. హ్యాండ్ తో హ్యాడ్ కలిపేశారు! సరే కలిపితే కలిపారు.. కాంగ్రెస్ లో చేరాలనుకుంటే చేరతారు అనుకుంటే… వెళ్తూ వెళ్తూ బీజేపీ గాలితీసేసినంత పనిచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!
అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ కి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికలకు కారణం అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరబోతుండటానికి కారణం ప్రజాభిష్టం అని చెప్పారు. అక్కడితో ఆగకుండా… బీజేపీకి అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు!
కాంగ్రెస్ లో తిరిగి ఎందుకు చేరాల్సి వస్తోందనే విషయాన్ని ప్రజలకు వివరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇందులో భాగంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో… తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని.. అయితే అందుకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు!
ఇక, ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగినా.. గతకొంత కాలంగా డీలా పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని, అందుకే తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాను కూడా వ్యవహరించాలని ఫిక్సైనట్లుతెలిపారు. ఇక, కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ విషయాలపై బీజేపీ నేతలు ఒక్కొక్కరే స్పందించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… ఎంపీ లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో మంచి హోదాని కల్పించిందని.. అలాంటి పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని లక్ష్మణ్ తెలిపారు. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. అప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ.. 15 నెలల్లోనే కాకుండా పోయిందా అని ప్రశ్నించారు!