ఆస్ట్రేలియా బీచ్ లో “మిస్టరీ వస్తువు”… చంద్రయాన్-3 శకలాలంటూ ప్రచారం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాకెట్ లాంచింగ్ విజయవంతం కావడంతో.. ఇక ఇప్పుడు అందరి ఆసక్తి దాని ప్రయాణంపైనే ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియాలో కనిపించిన ఒక వస్తువు… చంద్రయాన్-3 శకలం అంటూ ప్రచారం జరుగుతుందని తెలుస్తుంది.

అవును… ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మరో నెల రోజుల్లో చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ అవ్వబోతుందనేది తెలిసిన విషయమే! అయితే, ఆస్ట్రేలియాలో చంద్రయాన్-3 మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది. ఆస్ట్రేలియా బీచ్‌ లో కనపడిన ఒక మిస్టరీ వస్తువే ఇందుకు కారణం అని తెలుస్తుంది. సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3ని నింగిలోకి ఎల్వీఎం రాకెట్ మోసుకెళ్లింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనపడ్డాయి. ఈ క్రమంలో ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన శకలాలు చంద్రయాన్ రాకెట్‌ కు చెందినవే అనే ప్రచారం జరుగుతోంది. ఈ శకలానికి చెందిన ఫొటోలను ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా… ఈ శకలం విదేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని ఆస్ట్రేలియా అధికారులు అంచనా వేస్తున్నారట. ఇప్పటికే అనుమానం ఉన్న దేశాలకు కూడా ఆస్ట్రేలియా సమాచారం అందించిందట. బీచ్‌ లో పడి ఉన్న వస్తువు దగ్గరకు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో దాన్ని తాకొద్దని, కదిలించ వద్దని ప్రజలను హెచ్చరించిందని తెలుస్తుంది.

దీంతో అసలు ఈ మిస్టరీ వస్తువు ఏమిటా అనేది ఆసక్తిగా మారిందని తెలుస్తుంది. అదేమిటన్నది క్లారిటీ వచ్చేవరకూ ఈ ప్రచారం ఇలా జరుగుతూనే ఉండే అవకాశం ఉంది. మరోపక్క ఆ మిస్టరీ వస్తువును చూడటానికి జనం ఎగబడుతున్నారని తెలుస్తుంది.