మిస్‌కమ్యూనికేషన్.! బుగ్గనకీ సజ్జలకీ మధ్యన.!

కొన్నాళ్ళ క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘సాక్షిలో తప్పు రాస్తారు అధ్యక్షా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘సన్నబియ్యం’ విషయమై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలివి. అధికార పార్టీ సొంత పత్రికలో తప్పు రాయడమేంటి.? మొన్నామధ్యన, సీపీఎస్ రద్దు విషయమై, ‘అప్పట్లో సరైన అవగాహన లేక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

కానీ, వాస్తవం బోధపడింది.. సీపీఎస్ రద్దు చేయలేం..’ అని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో, మూడు రాజధానుల విషయంలో మిస్‌కమ్యూనికేషన్ జరిగిందనీ, రాజధాని అంటే అది విశాఖ మాత్రమేననీ, కర్నూలులో హైకోర్టు ప్రైమరీ బెంచ్ మాత్రమే వుంటుందనీ, అమరావతిలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయని బుగ్గన రాజేంద్రనాథ్ చెబితే, ‘ఆయన ఏ ఉద్దేశ్యంతో అలా అన్నారో నాకు తెలియదు. వైసీపీ విధానం మూడు రాజధానులే.. అమరావతితోపాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులే’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.

మొదటి వ్యవహారం ‘సన్నబియ్యం’ విషయంలో అది కేవలం రాజకీయ అంశమే కావొచ్చు. కానీ, మిగతా రెండు విషయాలూ అలా కాదు. రాజధాని లేదా రాజధానుల విషయం అత్యంత కీలకమైనది. మిస్ కమ్యూనికేషన్.. అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎలా చెప్పగలుగుతారు.? పైగా, ఆర్థిక మంత్రి వ్యాఖ్యల్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా ఖండించగలుగుతారు.? డిఫాక్టో సీఎం అనే విమర్శ సజ్జల మీద వుండనే వుంది. సజ్జల రామకృష్ణారెడ్డిది జస్ట్ క్యాబినెట్ ర్యాంక్ పదవి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘క్యాబినెట్ మినిస్టర్’. ఈ తేడా సజ్జలకు అర్థమవుతోందో లేదో.!