Nimmala Ramanaidu: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికీకరణ వైపు పరుగులు పెట్టిస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్య, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల్లోనే రూ. 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో, తద్వారా 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన వెల్లడించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అంతర్జాతీయంగా చంద్రబాబు నాయుడు (CBN) ఒక బ్రాండ్‌గా పేరుగాంచారని, ఆయన సీఎంగా ఉండటం పారిశ్రామికవేత్తలకు నమ్మకం, గౌరవం అని పేర్కొన్నారు.
గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో నేడు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయం తెచ్చేందుకు ప్రభుత్వం కీలక పాలసీలను తీసుకొచ్చిందని వివరించారు.
ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
ఎంఎస్ ఎంఈ పాలసీ
ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ

ఈ పాలసీలతో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని స్పష్టం చేశారు. “ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ పని చేస్తున్నారని వెల్లడించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిసారించింది. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయనున్నారు. వీటిని టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం రాష్ట్రానికి ఆహ్వానిస్తుంటే, వారు “రాష్ట్రంలో మళ్ళీ జగన్ రాడు” అనే గ్యారంటీ ఇవ్వమంటున్నారని మంత్రి తెలిపారు. గత పాలనలో అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంధ సంస్ధలు, జాకీ, ప్రాంక్టిన్ టెంపుల్టన్, లులూ, బిఆర్‌షెట్టి గ్రూప్, ట్రైటాన్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలతో పాటు ఫార్చూన్ 500 కంపెనీలను కూడా జగన్ బలవంతంగా పక్క రాష్ట్రాలకు తరిమేశారని మండిపడ్డారు.
“మరలా జగన్ వస్తే రప్పా, రప్పా నరుకుతామని.. టెండర్లు రద్దు చేస్తామని.. విధ్వంసం చేస్తామంటూ పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు” అని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

