Nara Lokesh: నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. ఆమెను చూసి నేర్చుకోవాలి: లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, దీనిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పనితీరును, నిరాడంబరతను ప్రశంసించడంతో పాటు, గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్త్రీ శక్తికి ప్రతిరూపమని లోకేష్ కొనియాడారు. మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి ఇక్కడి నేతన్నలకు అండగా నిలిచారని, ఆమెను చూసి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణాన్ని నేర్చుకోవాలని అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వడమే కాకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవడంలోనూ, గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

అమరావతిపై ‘దెయ్యాల’ పడగ గత ప్రభుత్వ పాలనపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని లాంటి అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని మండిపడ్డారు. “అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదు.. పవర్ ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని,” అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి కోసం రూ.450 కోట్లతో ప్యాలెస్ కట్టుకుని, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా “జై అమరావతి” అంటూ రైతులు చేసిన పోరాటం మరువలేనిదన్నారు.

అమరావతిలో ‘బ్యాంక్ స్ట్రీట్’ రాజధానిలో ఏర్పాటు కానున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గురించి మంత్రి వివరాలు వెల్లడించారు. సుమారు రూ.1334 కోట్ల పెట్టుబడితో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. అన్ని బ్యాంక్ సర్వీసులు ఒకే చోట లభించేలా ‘బ్యాంక్ స్ట్రీట్’ ఏర్పాటవుతోంది. రాష్ట్రవ్యాప్త లావాదేవీలకు ఈ కార్యాలయాలు కేంద్ర బిందువుగా మారనున్నాయి. రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేస్తోంది.

కాగితాలకు పరిమితం కాని అభివృద్ధి: పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వస్తున్న సాయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రజలకు కనిపించేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటుతో అమరావతి ఆర్థిక, విద్య, పరిశోధన కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, రాష్ట్రం కోసం నిలబడ్డ రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Bakka Jadson EXPOSED Tollywood Heroes || Chiranjeevi Nagarjuna || Telugu Rajyam