కేటీఆర్ – బండి: ఇద్దరూ నిజాలే చెబుతున్నారంట!

గతకొన్ని రోజులుగా కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్విట్టర్ వార్ రసవత్తరంగా సాగుతుంది. ట్విట్టర్‌ లో ఆన్ లైన్ పొలిటికల్ వార్ బీఆరెస్స్ వర్సెస్ బీజేపీగా మారింది. ఇందులో భాగంగా ముందుగా కేటీఆర్, మోడీకీ పాలనను – బీజేపీ వ్యవహారాలను విమర్శిస్తూ ఒక ట్వీట్ పెడతారు. వెంటనే ఆ ట్వీట్ కు బండి సంజయ్ రియాక్ట్ అవుతారు. వీరిద్దరిలో ఎవరు ట్వీట్ పెట్టినా మరోకరు స్పందించడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు మీడియా ముందు విమర్శలు చేసుకునే వీరిద్దరూ.. టీఎస్పీఎస్సీఇ పేపర్ లీకేజీ అంశం తర్వాత సోషల్ మీడియాలో మరీ స్పీడ్ పెంచారు.

ఇక పండగ సమయంలో వీరి ఫెర్మామెన్స్ మరీ పీక్స్ కి చేరుతుంది. ఇందులో భాగంగా… ఈనెల 22న ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన పంచాంగంలో కేటీఆర్ ఆదాయం అదానికీ.. వ్యయం జనానికి, బ్యాంకులకు అని ట్వీట్ చేయగా.. బండి సంజయ్.. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి… వ్యయం తెలంగాణ రాష్టానికి అని ట్వీట్‌ లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఆన్ లైన్ లో హల్ చల్ చేసింది. ఆ కంటిన్యుటీలో భాగంగా… మళ్లీ శ్రీరామనవమిని పురస్కరించుకొని మరోసారి ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.

వచ్చే నెల 8న మోడీ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వీరి వార్ వేడెక్కింది. కేటీఆర్ ట్విట్టర్‌ లో “తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం – పసుపు బోర్డు ఇవ్వం – మెట్రో రెండో దశ ఇవ్వం – ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం – గిరిజన యూనివర్సిటీ ఇవ్వం – బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం – ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం” అని ప్రధాని చెప్పిన స్టేట్ మెంట్స్ ని కలిపి కొట్టారు. అనంతరం… ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..? తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి? అని బీజేపీని ఉద్దేశించించి కేటీఆర్ పోస్టు చేశారు.

అనంతరం తగులుకున్న బండి సంజయ్… “ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం – దళితులకు మూడెకరాలు ఇవ్వం – దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం – నిరుద్యోగ భృతి ఇవ్వం – డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం – దళితబంధు అర్హులకు ఇవ్వం” – అని కేసీఆర్ చేసిన పనులను ఏకరువుపెట్టారు బండి.

ఇలా ఇద్దరిమధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరిగింది. ఇది బీఆరెస్స్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే… ఈ ట్వీట్లు నూటికి నూరుపాళ్లూ నిజమని.. కేటీఆర్ చెప్పినవీ వాస్తవాలే – బండి చెప్పినవి కూడా వాస్తవాలే అని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కేంద్రంలో బీజేపీ – రాష్ట్రంలో బీఆరెస్స్ లు పోటీపడి మరీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని చెబుతున్నారు. పిల్లి పిల్లి రొట్టుముక్క కోసం కొట్టుకుంటుంటే… వారిద్ధరిమధ్యా కోతి వచ్చి ఆ రొట్టెముక్కను తన్నుకుపోతుంది… చిన్నప్పటి ఆ కథని గుర్తుకు తెస్తున్నారు!!