ట్విటర్ కు పోటీగా మెటా థ్రెడ్ రిలీజ్ కు రెడీ… ప్రత్యేకతలివే!

ఈ ఏడాది జనవరి నుండి ట్విట్టర్ కు పోటీగా సరికొత్త యాప్ ను తీసుకురావాలని మెటా (META) కృష్టి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక కొత్త యాప్ ను సిద్ధం చేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో ట్విట్టర్ కంటే స్పెషల్ ఫీచర్స్, కనెక్ట్విటీ సౌలభ్యాలు ఉన్నాయని చెబుతుంది.

అవును… ట్విట్టర్ కు పోటీగా మెటా తీసుకురావాలనుకున్న కొత్త యాప్ వర్క్ పూర్తయిందని.. ఈ యాప్‌ ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ యాప్ దాదాపు ట్విట్టర్ లాగానే ఉంటుందట. దీనిలో ట్వీట్ చేయవచ్చు.. రీట్వీట్ చేయవచ్చు.. లైక్, షేర్, కామెంట్స్ చేయవచ్చు. అయితే ఈ యాప్ వెరిఫికేషన్ నిమిత్తం డబ్బు వసూలు చేస్తుందా లేదా అన్నది ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదు.

వాస్తవానికి ట్విట్టర్ తర్వాత ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ల కోసం మెటా చెల్లింపు ధృవీకరణ సేవను తీసుకువచ్చింది. దీంతో కొత్త యాప్‌ లో కూడా ఇలాంటి ఫీచర్‌ ను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ థ్రెడ్స్ యాప్‌ లో వినియోగదారులు ఇన్ స్టాగ్రాం ఐడీ సహాయంతో లాగిన్ చేయగలుగుతారట. దీని కోసం ప్రత్యేకంగా మరో కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంటే ఈ యాప్ లో లాగిన్ అయితే ఇన్ స్టాగ్రాం లో లాగిన్ అయినట్లేనన్నమాట.

కాగా… అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత నుంచి సామాజిక మాధ్యమ దిగ్గజం తరచుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ కు వివిధ మార్పులు చేస్తూ వివాదాలు కూడా సృష్టిస్తున్నారు ఎలాన్ మస్క్. తెరపైకి ఎక్కువగా పెయిడ్ సర్వీసులను తీసుకొస్తున్నారు. దీంతో ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ కు ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇక యాప్ స్టోర్ లో ప్రస్తుతం “ప్రీ ఆర్డర్”తో ఈ కొత్త యాప్ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ లిస్టింగ్ ప్రకారం.. గ్రూపులన్నీ ఒక చోట చేరి వివిధ అంశాలు, ట్రెండింగ్ టాపిక్స్ పై చర్చలు జరుపుకునేందుకు, ఫేవరెట్ క్రియేటర్లతో కనెక్ట్ అయ్యేందుకు ఈ మెటా థ్రెడ్స్ ఉపయోగపడుతుంది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ కలయికలో ఈ యాప్ ఉండటంతో… ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఇందులో చేరుతారని సంస్థ భావిస్తోంది.