శుభవార్త చెప్పిన మెగాస్టార్

megastar chiranjeevi told the good news
తెలుగు సినిమారంగంలో చిరంజీవి స్థానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.  నలభై ఇళ్లనుంచి ఆయన స్థానం సినిమాపరిశ్రమలో నంబర్ ఒకటి గానే ఉన్నది.  ఆయన తరువాత ఎంతమంది హీరోలు వచ్చినా, చిరంజీవి స్థానం మాత్రం సుస్థిరం.  కాలక్రమంలో ఆయన నివాసం హీరోల కర్మాగారమై వర్ధిల్లింది.  డజనుమందికి పైగా హీరోలు చిరంజీవి కుటుంబం నుంచి పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.  వారిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మెగా హీరోలుగా ఎదిగి సంచలన విజయాలను సాధిస్తున్నారు.  
megastar chiranjeevi told the good news
megastar chiranjeevi told the good news
 
చిరంజీవికి ఉన్న అభిమానులు కోట్లలో ఉంటారు. ఆయన రాజకీయ ప్రస్థానం సంగతి పక్కన పెడితే నటుడుగా, డాన్సర్ గా ఆయనను పార్టీలకు అతీతంగా అభిమానించేవారు అధికం.  అలాంటి చిరంజీవి తనకు కోవిద్ సోకిందని ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల వారు షాక్ తిన్నారు.  ఎందుకంటే ఆరోగ్యం విషయంలో చిరంజీవి చాలా  జాగ్రత్తగా  వ్యవహరిస్తారని ప్రతీతి.  ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొంది, ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్న శానిటైజర్ అనే వస్తువును దశాబ్దాల క్రితమే చిరంజీ ప్రస్తావించేవారు.  ఆయన శానిటైజర్ ను విధిగా ఉపయోగించేవారు.  పైగా కోవిద్ దశ మొదలైన నాటినుంచి షూటింగులకు దూరంగా ఉంటూ ఎవరినీ కలవడం లేదు.  ఇటీవల సినిమా ప్రముఖులు అనేకమంది కోవిద్ బారిన పడి విషమ స్థితికి వెళ్లిపోవడం, మరికొందరు దిగ్గజాలు కన్నుమూసిన నేపథ్యంలో చిరంజీవి తనకు వైరస్ సోకిందని ప్రకటించగానే అందరూ దిగ్భ్రమ చెందారు.  ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయాయని ట్వీట్ చేశారు చిరంజీవి.   ఆయన  త్వరగా కోలుకోవాలని  అభిమానులు  పూజలు, ప్రార్ధనలు చేశారు.  
 
ఇక్కడ మరొక సంచలనం కూడా చోటు చేసుకున్నది.  చిరంజీవి తనకు వైరస్ సోకిందని ప్రకటించిన రెండు రోజుల ముందు ఆయన తోటి నటుడు నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్,  ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డిలను కలవడంతో టీఆరెస్ పార్టీ వారు, తెలంగాణ ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు.  వారికేమైనా వైరస్ అంటుకుంటుందేమో అని భయపడ్డారు.  అయితే చిరంజీవిని కలిసినవారు ఎవ్వరూ పరీక్షలు చేయించుకున్న సమాచారం లేదు.  
 
 అయితే రెండు రోజుల తరువాత కోవిద్ టెస్ట్ చేసే పరికరంలోని లోపం కారణంగా తనకు పాజిటివ్ అని చూపించిందని, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకున్న తరువాత మూడు సార్లు నెగటివ్ వచ్చిందని చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.    
 
ఇక్కడ ఒక విషయం అనివార్యంగా సందేహానికి తావిస్తున్నది.  చిరంజీవి వంటి సెలబ్రిటీ పరీక్షలు చేయించుకునే ఆసుపత్రి పెద్ద స్థాయిలోనే ఉంటుంది.  అపోలో, కామినేని స్వయంగా వారి వియ్యంకులకు చెందినవే.  అక్కడే చిరంజీవి పరీక్ష చేయించుకుని ఉంటారు.  అలాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో  కూడా  లోపభూయిష్టమైన పరికరాలతో కోవిద్ పరీక్షలు చేస్తున్నారా?  చిరంజీవి లాంటి ప్రసిద్ధుడికే ఇలాంటి అనుభవం ఎదురైనపుడు ఇక సామాన్యుల సంగతి ఏమిటి?  తెలుగు రాష్ట్రాల్లో మొన్న మొన్నటివరకూ రోజూ పది నుంచి పదిహేను వేల కేసులు నమోదయ్యాయి.  వారిలో చాలామంది తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని చెబుతున్నారు.  మరికొందరు ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే పారాసిటమాల్ బిళ్ళలు   వేసుకుని బయటపడ్డామని తమ అనుభవాలను పంచుకుంటున్నారు.  మరి వీరిలో ఎంతమందికి వైరస్ సోకి ఉంటుంది?  నిజంగా సోకిందా లేక పరికరాల లోపం కారణంగా పాజిటివ్ గా తేలారా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా  మారింది. ఆసుపత్రులు ఇచ్చే రిపోర్టులను నమ్మాలా వద్దా?  తప్పుడు పరికరాలతో వైరస్ ఉందని భయపెట్టి రోగులనుంచి లక్షల రూపాయలు ఆసుపత్రుల యజమానులు దోచుకున్నారా అనేది మిస్టరీగా మారింది ఇప్పుడు.  
 
ఏదేమైనా తనకు కోవిద్ లేదని చిరంజీవి ప్రకటించడం అభిమానులలో ఆనందాన్ని కలిగించింది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు