మేమింతే.. టెక్నాలజీ ఎంత పెరిగినా గానీ.. ఆస్కార్లే రానీ.. జాతీయ స్థాయి నటుల కోలాహలమే ఉండనీ.. వాళ్ళకి కోట్లాది రూపాయలు చెల్లించి బడ్జెట్లు వందల కోట్లే దాటిపోనీ.. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్.. ఇత్యాది హంగామాలు ఎన్నయినా చెయ్యనీ.. జక్కన్నలు.. మాటల మాంత్రికులు.. మహానటి దిగ్ధర్శకులు.. దేశాలు దాటి.. మంచు కొండలు తడిమి.. ఊహకందని సెట్లు వేసి.. భారీతనం చూపించి.. అభూతకల్పనలు సృష్టించి..
రామాయణంలో పాత్రలను.. భారతంలో దేవుళ్ళను.. భాగవతంలో అవతార పురుషులను.. వేరే అవతారాల్లో కళ్ల ముందు ఆవిష్కరించనీ..
యాక్షన్..ఫిక్షన్.. హార్రర్..టెర్రర్.. సైన్స్..సెన్స్.. సెవెంత్ సెన్స్.. నాన్సెన్స్. న్యూసెన్స్.. ఏవైనా తియ్యనీ..
మేం మారం.. మాకు నచ్చినవి.. చూడాలనుకున్నవే చూస్తాం..
ఆదిపురుష్ భారీ కట్ఔట్ కంటే లవకుశ లో నిండైన రామయ్యనే చూస్తాం..
ఆర్ ఆర్ ఆర్ డ్రామాలను ఎంజాయ్ చేసినా వెంటనే మర్చిపోయి మా కిట్టయ్య అల్లూరి సీతారామరాజు లోకి ఎళ్ళిపోతాం..
అయిదేళ్ల బాహుబలి అపూర్వం అనుకున్నా.. అంతకు చాలా పూర్వం తీసిన ఎన్టీవోడి బందిపోటు చూసి అబ్బురపడిపోతాం..
కాంచన..విరూపాక్ష.. కాజల్ కార్తీక.. గీతాంజలి ఈజ్ బ్యాక్.. ఇలాంటి నయా హర్రర్ సినిమాలు ఎన్ని వస్తున్నా.. ఒకనాటి నలుపుతెలుపు ఆమె ఎవరు ఈస్ట్మన్ కలర్ అవేకళ్ళు చూసి తెగ ధ్రిల్లైపోతాం..
అంత పెద్ద కుటుంబం.. నయా సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం.. దునియా మెచ్చిన రెబల్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్.. స్టైలిష్ స్టార్.. సన్నాఫ్ సత్యమూర్తి.. ఇలా మెగాపవర్లు రంగస్థలంపై ఎందరు కొత్త హీ”రోల్” ఓలలాడిస్తున్నా.. డెబ్బైల నాటి పండంటికాపురం.. ఎనభైల అమరదీపం.. అంతకు ముందు వచ్చిన తాత మనవడు.. సంబరాల రాంబాబు.. విజేత..ఆమెకధ.. ఇంకా ఎన్నో కుటుంబ కథలే మా ప్రాధాన్యత..ధన్యత..!
బాలకృష్ణ..నాగార్జున.. జూ.ఎన్టీఆర్.. నాగచైతన్య.. ఇలా నందమూరి.. అక్కినేని వారసులున్నా.. మా సూరీకాంతం లేని గుండమ్మకథ ఉప్పు లేని కూర.. చక్కెర కలపని మిఠాయి.. ఎహే..అసలు గుండమ్మకథ ప్రపంచ సినిమాలోనే ఒక కలికితురాయి..!
తోటరామున్ని మించిన నాయకుడు.. యస్వీఆర్ని తలదన్నే మాంత్రికుడు.. అక్కినేని దేవదాసు నిషాకళ్ళు.. సోగ్గాడు శోభనాద్రి.. ఆంధ్రా సిల్వర్ ముత్యాలముగ్గు రావుగోపాలరావు.. కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు.. ఈళ్ళని మించినోళ్ళు ప్రపంచ సినిమాలో ఇంకొకళ్ళు ఉన్నారా..
మీ ఆధునిక వాయిద్యాల గోలలో.. మహదేవన్ మెలోడీ.. సాలూరు వారి రసాలూరు.. మాస్టారి మధురిమలు.. విని చెవుల తుప్పు వదిలించుకునే చాదస్తపు పాత పాటల పిచ్చోళ్ళం..
నాటునాటుకి ఆస్కారొచ్చినా మా సూపర్ స్టార్ గుంతలకిడి.. గుంతలకిడి గుమ్మ స్టెప్పులు.. ఎంత ప్రేక్షక పురస్కార్..
ఇన్ని చెప్పాక.. కల్కి 2898 మేటర్.. అసలు ప్రపంచ సినిమాకి మాయాబజారే పెరామీటర్..ప్యారామేటర్!
కల్కిలో కనిపించని కృష్ణుడు.. మాయాబజార్లో కనిపించని పాండవులు..
దీపికా పడుకొనే.. శశిరేఖ సావిత్రి..
ఆరడుగుల అమితాబ్ అదరగొట్టాడు ఒట్టు.. ఆజానుబాహువు నాటి ఘటోత్కచుడు రంగారావు ముందు తీసికట్టు..
నాగ అశ్విన్ గ్రాఫిక్స్.. కెవి రెడ్డి ట్రిక్స్.. ఏవి అసలైన క్లిక్స్…
నేనైతే..ఎప్పటికీ వినోదాన్ని కొనుక్కునేది ఆ మాయాబజార్లోనే..
నేటి సినిమాలు.. క్యాటరింగు బఫే భోజనాలు… జనాలు మెచ్చేది నాటి.. వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. అహహ నాకె ముందు..!
నేటి సినిమా టెక్నిక్.. నాటి సినిమా పిక్నిక్..
ఇప్పటి సినిమా వ్యయం.. అప్పటి బైస్కోప్ ప్రియం..
కొత్త సినిమా ఆయింట్మెంట్.. పాత బొమ్మ సెంటిమెంట్..
అన్ని మాటలేల.. ఇవి గోల… అవి హేల..
ఇవి సినీమాయలు.. అవి సినిమాలు..!
ఇవి చూడక చస్తామా.. అనుకుంటూ అవి చూస్తాం..!!