ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి చెందిన పెట్రోల్ బంకులో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ఆర్టీసీ డిపోకు చెందిన పెట్రోల్ బంక్‌లో సిబ్బంది ఏకంగా రూ.65 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ స్కామ్‌కు సంబంధించి మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2024 డిసెంబర్ 7న ప్రారంభమైన ఈ పెట్రోల్ బంకులో, సిబ్బంది కొందరు దానిలోని సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత ఎనిమిది నెలల కాలంలోనే రూ.65 లక్షల నిధులను గోల్‌మాల్ చేసినట్లు విచారణలో తేలింది.
ఈ వ్యవహారం బయటపడిన తర్వాత, రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్టీసీ డీపీటీఓ రాము విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ అంశంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట పట్టణ సీఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో, ఆర్టీసీ పెట్రోల్ బంకు నిర్వహణను పర్యవేక్షిస్తున్న డిపో క్లర్క్ పి.ఆర్. నాయుడు, అసిస్టెంట్ డిపో క్లర్క్ పి.ఎల్. నర్సారెడ్డి సహా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మరో 27 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ స్కామ్ ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపింది.

