రాజకీయాల్లోకి మంచు మనోజ్.! టీడీపీలో చేరికకి రంగం సిద్ధం.!

సినీ నటుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ప్రచారం ఈనాటిది కాదు. అయితే, రాజకీయాల్లో చేరే విషయమై మంచు మనోజ్.. నాన్చుతూ.. నాన్చుతూ వస్తున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మంచు మనోజ్‌కి చాలా చాలా ఇష్టం.! మంచు మోహన్‌బాబు కావొచ్చు, మంచు విష్ణు కావొచ్చు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వీలు చిక్కితే చాలు సెటైర్లేస్తుంటారు. కానీ, మంచు మనోజ్ అలా కాదు.

ఇదిలా వుంటే, మంచు మనోజ్ తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని సతీ సమేతంగా కలిశారు. ‘మర్యాదపూర్వక భేటీ.. క్యాజువల్ మీటింగ్’ అంటూ మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి చెప్పుకొచ్చారు. కుమారుడి పుట్టినరోజునాడు పెద్దాయన ఆశీస్సులు తీసుకున్నామన్నది ఈ దంపతుల ఉవాచ.

భూమా మౌనిక రెడ్డి తల్లి శోభా నాగిరెడ్డి.. అలాగే, మౌనిక రెడ్డి తండ్రి భూమా నాగిరెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే. మౌనిక రెడ్డి సోదరి అఖిల ప్రియ, ప్రస్తుతం టీడీపీలోనే వున్నారు. సో, టీడీపీలోకే మౌనిక రెడ్డి కూడా వచ్చే అవకాశముంది. ఆల్రెడీ ఆమె టీడీపీ నేతగానే ప్రచారంలో వున్నారు.

మంచు మనోజ్ విషయంలోనే స్పష్టత రావాల్సి వుంది. రాజకీయంగా మౌనిక రెడ్డికి సపోర్ట్ చేస్తానని ఇప్పటిదాకా మనోజ్ చెబుతూ వచ్చాడు. కానీ, మనోజ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నాడన్నది తాజా ఖబర్. మనోజ్ సంగతి పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో మంచు లక్ష్మి కూడా రాజకీయాల్లోకి రావొచ్చంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మనోజ్ రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.