ఒక వైపు బెంగళూరులో సుమారు 26 పార్టీలు కలిసి విపక్షాల భేటీ… మరో వైపు దేశ రాజధానిలో అధికార పక్షం భేటీ. ఇలా రెండు వైపులా హోరా హోరీగా అన్నట్లుగా వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు ప్రతివ్యూహాలు యుద్ధ సన్నాహాల రేంజ్ లో జరిగాయి. దీంతో జాతీయ రాజకీయం వేడెక్కిపోతోంది. ఈ సందర్భంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని తెలుస్తుంది.
అవును… తాజాగా బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి భేటీకి 26 పార్టీలు అటెండ్ అయితే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే తరఫున 38 పార్టీలు హాజరయ్యాయని… ఇది తమ బలం, బలగం అని బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆర్భాటంగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీయే భేటీ మీద అసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఎన్డీయే భేటీలో పాలుపంచుకునే పార్టీలలో రిజిషర్డ్ పార్టీలు ఎన్నో అంటూ వెటకారం ప్రదర్శించారు. అంటే చిన్న పార్టీలు బుల్లి పార్టీలు అసలు ఎన్నికలలో గెలవని పార్టీలు ఇలా చాలా లిస్ట్ ఉందని విపక్ష నేతలు విమర్శలు మొదలెట్టారు. వాస్తవానికి ఎన్డీయే మీటింగ్ లో హాజరైన 38 పార్టీలలోనూ సుమారు 25 పార్టీలకు పార్లెంట్ లో ఒక్కటంటే ఒక్క మెంబర్ కూడా లేరని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో మరింత వెటకరించిన ఖర్గే… అసలు వాటిలో రిజిస్టర్ అయిన పార్టీలు ఎన్ని అని అన్నారు. ఇదే సమయంలో అలాంటి పార్టీలు అన్నీ కూడా కూడగట్టి.. తమదే పెద్ద కూటమి, మెగా కూటమి అంటూ ఎన్డీయే పెద్దలు చెప్పుకుంటున్నారని విపక్షాలు సెటైర్లు పేల్చుతున్నాయి. ఇదే సమయంలో పార్టీల సంఖ్య సంగతి కాసేపు పక్కనపెడితే… బలమైన పార్టీల సమూహం విషయంలో తమ బలమే ఎక్కువని చెబుతున్నాయట విపక్ష పార్టీలు.
అందులో భాగంగా… విపక్ష కూటమిలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఉభయ కమ్న్యునిస్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు కొత్తగా జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆం ఆద్మీ పార్టీ ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయ్యంలో ఆయా రాష్ట్రాలలో గట్టిగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, మొహబూబా ముఫ్తీ, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు అటెండ్ అయ్యారని గుర్తు చేస్తున్నారంట.
ఇలా బలం విషయంలో తమదే ఎక్కువ అని చెబుతూ… తమలో ఉన్న ఐక్యత కూడా గట్టిదని నొక్కివక్కానిస్తూ… అధికారంలోకి వచ్చేది తమ కూటమే అంటోంది విపక్ష కూటమి. ఈ సమయంలోనే ఎన్డీయేలో ఉన్న పార్టీలలో రిజిష్టర్డ్ పార్టీలు ఎన్నో చెప్పాలంటూ మల్లికార్జున ఖర్గే వేసిన ప్రశ్న కానీ చేసిన సవాల్ కానీ ఆసక్తికరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
కాగా… ఢిల్లీలోని ఎన్డీయే కూటమి సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ జనసేన పార్టీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి కూడా అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ సున్నా ప్రాధాన్యత ఉంది! ఇలాంటి పార్టీలే సుమారు 25 వరకూ ఎన్ డీయే కూటమిలో ఉన్నాయని అంటున్నారు.