రాయలసీమలో లోకేష్ గళం.! టీడీపీకి ఎంత లాభం.?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో విజయవంతంగా సాగుతోంది. అంచనాలకు మించి జనాన్ని సమీకరించగలుగుతోంది తెలుగుదేశం పార్టీ. కొంతమేర జనాన్ని తరలిస్తున్నా, స్వచ్ఛందంగా కూడా జనం తరలి వస్తుండడంతో టీడీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రాయలసీమలో పర్యటన నేపథ్యంలో, స్థానిక సమస్యల్ని నారా లోకేష్ తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆయా సమస్యల్ని పరిష్కరిస్తామనీ చెబుతున్నారు. ‘అసలంటూ సమస్యలకు మీరే కారణం.. ఐదేళ్ళ పాలనలో మీరు ఏం చేశారు.?’ అన్న నిలదీతలూ ఎదురవుతున్నాయి నారా లోకేష్‌కి.

ఆ సంగతి పక్కన పెడితే, రాయలసీమ డిక్లరేషన్‌ని నారా లోకేష్ ప్రకటించబోతున్నారట. అదెలా వుంటుందో ఏమో.! ముఖ్యమంత్రి మీద విమర్శలు, ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే ఆ నియోజకవర్గ వైసీపీ నేతల మీద విమర్శలతో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.

ఎండల్నీ, వర్షాల్ని సైతం నారా లోకేష్ లెక్క చేయడంలేదన్నది ఇంకో కోణం. నిజమే, యువకుడు కదా.. ఉత్సాహంతో నడిచేస్తున్నాడు. చిన్నా చితకా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నా ముందుకు కదులుతున్నాడాయన.

అయితే, ఏం చేసినా రాయలసీమలో వైసీపీ మీద పట్టు సాధించడం టీడీపీకి అంత తేలిక కాదు.! వస్తున్న జనాన్ని చూసి, ‘మాదే పై చేయి’ అని టీడీపీ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. టీడీపీ అడుగు పెట్టలేని ప్రాంతాలు చాలానే వున్నాయి రాయలసీమలో.