చాలా మంది రోజుని నిమ్మకాయ నీరు తాగడంతో ప్రారంభిస్తారు. ప్రకృతిసిద్ధంగా Refresh చేసే ఈ పానీయం శరీరానికి శక్తిని అందించడమే కాదు… ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. జీవక్రియ వేగవంతం కావడం ద్వారా బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నిమ్మకాయ నీరు రోజూ తాగడం మంచిదైనా.. దాన్ని ఎలా తాగుతున్నామన్నది కూడా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం కొందరికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలున్నవారికి ఇది మరింత బాధ కలిగించే అవకాశం ఉంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, శరీరం లోపల ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీని ప్రభావం కడుపు మీద, దంతాలపైనా ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల దంతాల ఎనామెల్ బలహీనమవుతుంది. దాంతో దంతాల సున్నితత్వం, కావిటీస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశముంటుంది.
ఇక మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు, తక్కువ బీపీ ఉన్నవారు కూడా నిమ్మకాయ నీరు తాగే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఏకకాలంలో ఎక్కువ నిమ్మకాయను నీటిలో కలపడం కూడా శరీరానికి సమస్యలు తెచ్చిపెడుతుందనే సూచన నిపుణులది. అందుకే, గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండితే సరిపోతుందని వారు చెబుతున్నారు. నిమ్మకాయ పరిమాణాన్ని నియంత్రించాలి. తాగిన వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం కూడా అవసరం.
కొందరికి నిమ్మకాయ నీటితో అలెర్జీ వంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. అలాంటి వారు, అలాగే, దంతాల సున్నితత్వం కలిగినవారు స్ట్రా ఉపయోగించి తాగడం వల్ల నేరుగా దంతాలపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకే, నిమ్మకాయ నీరు మంచి ప్రయోజనాలు కలిగించాలంటే, దానిని తాగే విధానం కూడా శ్రద్ధగా ఉండాలి. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రయత్నంలో అప్రమత్తత పాటించకపోతే, హాని కలిగే ప్రమాదం ఉంటుందని నిపుణుల హెచ్చరిక. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని మేము ధృవీకరించడం లేదు. ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.)
