వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుబేర విగ్రహం ఉండటం అంటే కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు. అది అదృష్టాన్ని, సంపదను ఆహ్వానించే ఒక శక్తివంతమైన ప్రతీకగా పరిగణిస్తారు. కుబేర విగ్రహం ధనాధిపతిగా భావిస్తారు కాబట్టి ఆయన విగ్రహం ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థికంగా ఎదుగుదల, శాంతి, ఆనందం లభిస్తాయని నమ్మకం ఉంది. సరైన స్థలంలో ఉంచిన కుబేర విగ్రహం ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఇంటి తలుపు దగ్గర లేదా ఎంట్రన్స్ హాల్‌లో ఉంచితే, సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని విశ్వాసం. ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరి కంటికి విగ్రహం పడటం ద్వారా ఆ శక్తి మరింత బలంగా వ్యాపిస్తుందని నిపుణుల అభిప్రాయం. విగ్రహాన్ని మూసివేసిన చోట, చీకటి ప్రదేశంలో ఉంచకూడదు. అది ఎల్లప్పుడూ వెలుగు మరియు శుభ్రమైన వాతావరణంలో ఉండాలి.
విగ్రహాన్ని నేలపై ఉంచడం పెద్ద తప్పుగా భావిస్తారు. కుబేరుడిని గౌరవంతో ఎత్తైన స్థలంలో, అలంకార మేడపై ఉంచితేనే శక్తి సక్రమంగా వ్యాపిస్తుంది. టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులపై ఉంచడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బూట్ల దగ్గర లేదా చెత్త దగ్గర ఉంచడం వల్ల దాని శక్తి తగ్గిపోతుందని విశ్వాసం. ఇటీవలి కాలంలో నవ్వుతున్న బుద్ధుడు రూపంలో ఉన్న కుబేర విగ్రహాల ప్రాచుర్యం పెరిగింది. ఈ విగ్రహం ఇంట్లో ఆనందాన్ని, సానుకూలతను పెంచుతుందని చెబుతారు. ఉదయాన్నే కుబేర విగ్రహాన్ని చూడడం ఒక మంచి శకునంగా భావిస్తారు. దీని చుట్టూ దీపాలు వెలిగించడం, పూలు పెట్టడం వల్ల ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుందని నమ్మకం.
వాస్తు నిపుణులు చెబుతున్నట్లు, విగ్రహాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దిశ, ఎత్తు, శుభ్రత, కాంతి ఇవన్నీ కుబేర విగ్రహం ఉంచే విషయంలో కీలకం. విగ్రహాన్ని రోజూ చూసే స్థలంలో ఉంచడం ద్వారా మనసులో సానుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, సమృద్ధి, ఆర్థిక స్థిరత్వం నెలకొంటుంది. ఇంట్లో ఒక చిన్న మార్పు అదృష్టాన్ని తలుపు తట్టేలా చేయగలదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కుబేర విగ్రహాన్ని సరైన విధంగా ఉంచడం, పూజలో భాగం చేయడం, శుభ్రత పాటించడం వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ చిన్న జాగ్రత్తే ఆర్థికంగా పెద్ద మార్పుకు దారితీసే శక్తి కలిగి ఉంటుంది.
