టిఆర్ఎస్ తొలి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన కేటిఆర్

టిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమితులైన కల్వకుంట్ల తారక రామారావు దూకుడు పెంచారు. పార్టీపై పూర్తి స్థాయిలో కంట్రోల్ తెచ్చుకునేందుకు కేటిఆర్ శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూనే… మరోవైపు టిఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల విషయంలో తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించి కేటిఆర్ తన మార్కు చూపించారు.

టిఆర్ఎస్ పార్టీలో ినిన్నమొన్నటి వరకు నెంబర్ 2 ఎవరు అనే చర్చ బాగా జరిగింది. రేస్ లో కేటిఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నట్లు పార్టీలో టాక్ నడిచింది. కానీ ముందస్తు ఎన్నికల తర్వాత కేటిఆర్ ను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు కేసిఆర్. దీంతో ఇక నెంబర్ 2 ఎవరు అనే చర్చకు పులిస్టాప్ పడింది. ఇప్పడు టిఆర్ఎస్ లో కేటిఆరే నెంబర్ 2 అయ్యారు. పాలన అంతా కేసిఆర్ చూసుకుంటున్నవేళ పార్టీ వ్యవహారాలన్నీ కేటిఆర్ నడుపుతున్నారు.

అందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంటు సీటుకు అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించారు కేటిఆర్. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు ఎంపీ గా వినోద్ కుమార్ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ పార్లమెంటుకు సీటు వినోద్ కుమార్ పోటీ చేస్తాడని కేటిఆర్ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో కేటిఆర్ ప్రకటించాడంటే ఇక ఆ సీటులో వినోద్ పోటీ చేయడం లాంఛనమే అంటున్నారు. 

2019 పార్లమెంటు ఎన్నికలకు టిఆర్ఎస్ తొలి అభ్యర్థి వినోద్

తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లకు గాను టిఆర్ఎస్ ఇప్పటికే ఒక అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ సీటును వినోద్ కుమార్ కు ప్రకటించడంతో మిగిలిన 15 సీట్లలో ఎవరిని ప్రకటిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంటే 17లో ఒక సీటులో ఫ్రెండ్లీ పార్టీ అయిన ఎంఐఎం పోటీ చేయనుంది. హైదరాబాద్ సీటులో ఎంఐఎం మినహా మిగిలిన 16 సీట్లకు టిఆర్ఎస్ అభ్యర్థులను నిలిపి గెలిపించుకునేందుకు కేటిఆర్ ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

16 సీట్లకు గాను ప్రస్తుతం టిఆర్ఎస్ ఖాతాలో 14 ఎంపీ సీట్లు ఉండాలి. అయితే చేవెళ్ల ఎంపీ టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన సీటులో ఈసారి టిఆర్ఎస్ తరుపున మాజీ మంత్రి, తాండూరులో ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. మిగిలిన సీట్లలో నాగర్ కర్నూలు కు నంది ఎల్లయ్య కాంగ్రెస్ సభ్యుడు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ చెన్నూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కూడా తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  

అయితే తొలి సీటులో వినోద్ కుమార్ పేరును ప్రకటించారు. మిగతా సీట్లలో పాత ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటిస్తారా? లేదంటే కొత్తవారిని తీసుకొస్తారా అన్న ఉత్కంఠ మొదలైంది. పెద్దపల్లికి మాజీ ఎంపీ వివేక్ పేరుతోపాటు టిఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పేరు, సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య పేరు కూడా వినబడుతున్నాయి. నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఈసారి పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. నిజామాబాద్ లో కవిత మళ్లీ పోటీ చేస్తారా? లేదంటే ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ ఉంది. ఇక మిగిలిన వారందరినీ కంటిన్యూ చేసే అవకాశాలే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.