Kollu Ravindra: కల్తీ మద్యం కేసు: వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసు అధికార తెలుగుదేశం (టీడీపీ), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలకు మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మద్యం మాఫియా వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

కృష్ణాజిల్లాలో పర్యటించిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. “రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా?” అని ప్రశ్నించారు. అంతేకాక, “వైసీపీ పెద్దలకు సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు లేవా?” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

నకిలీ మద్యం కేసు వెనుక ఎంతటివారలున్నా విడిచిపెట్టేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలను అన్నింటినీ బయటకు తీస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

కల్తీ మద్యాన్ని గుర్తించింది ఎక్సైజ్ శాఖ అధికారులేనని మంత్రి కొల్లు తెలిపారు. నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయడం వల్లే కల్తీని గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోగలిగామని చెప్పారు. ఈ కేసులో తమ పార్టీకి (టీడీపీకి) చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, కేసులు నమోదు చేశామని వెల్లడించారు. కల్తీ మద్యం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు తీసేందుకు సమగ్ర విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో మద్యాన్ని పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Korada Ravi Shankar Reveals Some Untold Story Of His Father Chalam | Comedian Chalam | Telugu Rajyam