Kidney: ఆహారంలో ఈ చిన్న మార్పు చేస్తే మీ కిడ్నీలు సేఫ్.. లేకపోతే..!

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడితే శరీరాన్ని తట్టుకోలేని నొప్పులు వేధిస్తాయి. ఒక్కసారి రాయి కదిలితే వెన్ను, పొత్తికడుపు, మూత్ర నాళాల్లో నొప్పి వస్తుంది. వాంతులు, మూత్రంలో ఇబ్బందులు కూడా వెంటాడుతాయి. అందుకే వైద్యులు చెబుతున్న ఒకటే.. రాళ్లు వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవడం కన్నా.. ముందే నివారణ చేసుకోవడం శ్రేయస్కరం. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టే నీరు. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా సులభంగా బయటపడతాయి. దీని వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కేవలం నీరు మాత్రమే కాదు, నిమ్మరసం, కొబ్బరి నీరు, హెర్బల్ టీలు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వంటివి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లు రాళ్లను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే సిట్రేట్ అనే పదార్థం కాల్షియంతో కలసి రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుందని పండితులు చెబుతున్నారు.

మరోవైపు తప్పుడు ఆహారపు అలవాట్లు శరీరానికి ప్రమాదకరమని పండితులు అంటున్నారు. పాలకూర, బీట్‌రూట్, బాదం, జీడిపప్పు వంటి అధిక ఆక్సలేట్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం రాళ్లకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పాలు, పెరుగు వంటి కాల్షియం ఆహారాలతో కలిపి తీసుకుంటే ఆక్సలేట్ ప్రభావం తగ్గిపోతుంది. ఇదే సమయంలో కాల్షియం టాబ్లెట్లు మాత్రం వైద్యుడు సూచించకుండా వాడకూడదు.

చక్కెర పానీయాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ కిడ్నీలపై అనవసరమైన భారాన్ని పెడతాయి. అలాగే ఎర్ర మాంసం, అవయవ మాంసాలు, చేపలను అధికంగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువ అవుతుంది. వీటి బదులుగా కాయధాన్యాలు, శనగలు, పచ్చి బఠాణీలు వంటి మొక్కల ప్రోటీన్ వనరులు తీసుకోవడం సురక్షితం. ఉప్పు కూడా మరో దాగిన శత్రువు. చిప్స్, ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసం, సాస్‌లు వంటి ఆహారాల్లో అధిక ఉప్పు ఉంటుంది. ఇవి రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. రుచికి ఉప్పు తగ్గించి, మసాలాలు, పచ్చి కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తే కిడ్నీలకు మేలు జరుగుతుంది.

క్యాబేజీ, కాలీఫ్లవర్, గుమ్మడికాయ వంటి తక్కువ ఆక్సలేట్ కూరగాయలను ఆహారంలో చేర్చడం మంచిది. వీటిని ఉడకబెట్టి తింటే జీర్ణక్రియ సులభమవుతుంది. అలాగే పాలు, పెరుగు, కేల్ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ప్రేగులలో ఆక్సలేట్‌ను కట్టిపడేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే రాళ్ల సమస్య 80% వరకు నివారించవచ్చు అంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, సంతులిత ఆహారం తినడం ఇవన్నీ కిడ్నీ ఆరోగ్యానికి రక్షణ కవచంగా పనిచేస్తాయంట. మొత్తం మీద నీరు ఎక్కువ తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడం, హానికర ఆహారాలను తగ్గించడం ద్వారా రాళ్లు ఏర్పడే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కిడ్నీలను శుభ్రంగా ఉంచుకోవడం అంటే శరీరానికి ఒక కొత్త శక్తిని ఇచ్చినట్టే.