కేసీయార్ నిజంగానే అంత పెద్ద తప్పు చేసేశారా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాల్ని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న మార్పులేవో వుంటే వుండొచ్చుగానీ, ఇదే లిస్ట్ దాదాపు ఫైనల్.. అని కేసీయార్ తేల్చి చెప్పేశారు కూడా.

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. టిక్కెట్లు ఎవరెవరికి ఇస్తున్నదీ ప్రకటించేశాక, ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందం సర్వేలు చేసేస్తోంది.! భారత్ రాష్ట్ర సమితిగా మారిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, జనాల్లోకి గతంలోలా బలంగా వెళ్ళే అవకాశాలు కన్పించడంలేదన్నది ప్రాథమికంగా వినిపిస్తోన్న వాదన.

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ కేసీయార్, మూడోసారి అధికార పీఠమెక్కడం అంత తేలిక కాదు. అయితే, విపక్షాలు తెలంగాణలో అంత బలంగా లేవు. అదే, భారత్ రాష్ట్ర సమితికి కలిసొచ్చే అంశం.

బండి సంజయ్‌ని బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం బీజేపీ అధినాయకత్వం చేసిన అతి పెద్ద బ్లండర్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.!

ఇక, బీఆర్ఎస్‌లో కూడా కుమ్ములాటలు ఎక్కువైపోయాయ్. ఫలానా అభ్యర్థి అయితే, ఓడించేస్తామంటూ ఆయా నియోజకవర్గాల్లో నిరసన గళాలు భారత్ రాష్ట్ర సమితిని గట్టిగా తాకుతున్నాయి.. అదీ సొంత పార్టీ శ్రేణుల నుంచే.! ఈ నేపథ్యంలో కేసీయార్ డైలమాలో పడిపోయారన్నది తాజా ఖబర్.

ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా వుంటుందని కేసీయార్‌కి తెలుసు. అయితే, ముక్కోణపు పోటీలో తామే లాభపడతామనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనీ కేసీయార్ భావిస్తున్నారు. అయితే, అభ్యర్థుల్ని ముందే ప్రకటించడమన్నది కేసీయార్ చేసిన అతి పెద్ద బ్లండర్.. అన్నది రాజకీయ విశ్లేషకుల తాజా అంచనా.