గతంలో ఏనాడూ ఏ ఎన్నికలకూ కంగారుపడనంత స్థాయిలో కేసీఆర్ దుబ్బాక ఎన్నికల విషయం,లో కంగారుపడ్డారన్నది వాస్తవం. ప్రతిపక్ష పార్టీలు ఎన్నడూ లేని విధంగా పుంజుకున్నాయనేది కూడ నిజమే. అందుకే హరీష్ రావును రంగంలోకి దింపారు కేసీఆర్. ఎన్నికలు ముగిసేవరకు హరీష్ రావు వేరే ఏ పనీ పెట్టుకోకుండా దుబ్బాక మీద దృష్టి పెట్టారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడ సర్వశక్తులు ఒడ్డి అధికార పార్టీకి ఎదురీదాయి. ఉప ఎన్నిక ఖాయమైనపుడు కేసీఆర్ లక్ష మెజారిటీ అలవోకగా వస్తుందని అన్నారు కానీ ఆ తరవాత పరిణామాలు గెలిస్తే చాలానే అభిప్రాయాన్ని కలిగించాయి. కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టి దెబ్బకొడితే బీజేపీ మాత్రం తనదైన రచ్చ రాజకీయంతో హడావుడి చేసింది.
ప్రచారం ముగియడానికి 10 రోజుల ముందు జరిగిన ఈ సంఘటనలన్నీ ఓటర్ల మీద గట్టి ప్రభావాన్ని చూపాయనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ సైతం ఈ సంగతిని గ్రహించినట్టే ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ సంగతిని బయటపెట్టాయి. ప్రముఖ సీపీఎస్ సర్వే అయితే టీఆర్‌ఎస్‌కు 47.4 శాతం, బీజేపీ 35.3 శాతం, కాంగ్రెస్‌కు 14.7 శాతం, ఇతరులు 2.6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. టీఆర్‌ఎస్ మెజార్టీ 19,600 నుంచి 22 వేల మధ్య పరిమితమవుతుందని తేల్చింది. సీపీఎస్ సర్వే 2018 ఎన్నికల్లో తెరాస, 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయగలిగాయి. ఇదే కేసీఆర్ కాళ్ళ కింద భూమిని కంపించేలా చేస్తోంది.
కేసీఆర్ ఆరంభమలో లక్ష ఓట్ల మెజారిటీ అని ఛాలెంజ్ చేశారు. హరీష్ రావు కూడ అదే స్థాయిలో మాట్లాడారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ తప్పకుండా పుంజుకుంటాయని చెబుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం అధికార పార్టీకి పెద్ద గొప్పేమీ కాదు. మెజారిటీయే ఇక్కడ సమస్య. భారీ మెజారిటీ వస్తే ఈ రెండేళ్లలో వారి పాలన పట్ల ప్రజలు సంతృప్తి చెందినట్టు అర్థం. అలా కాకుండా తక్కువ స్థాయి మెజారిటీతో బయటపడితే మాత్రం అది పరాభవమే అవుతుంది. జనంలో పార్టీ పట్ల, కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తి మొదలైనట్టే. ఇది రాబోయే ఎన్నికల్లో విపక్షాలకు పెద్ద బెనిఫిట్ అవుతుంది. అది రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపే ప్రమాదముంది. అదే ఇప్పుడు కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తోంది.