కేసీయార్ రెండో ఆలోచన!. భయం వల్లేనా.?

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేశారు.

స్వయంగా కేసీయార్ ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు. ఒకటి గజ్వేల్, ఇంకోటి కామారెడ్డి నియోజకవర్గం. గజ్వేల్‌లో ఓటమి తప్పదన్న భయంతో, అదనంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని కేసీయార్ ఎంచుకున్నారనే విమర్శలు సహజంగానే కాంగ్రెస్, బీజేపీ నుంచి దూసుకొస్తున్నాయ్.

‘చేతనైతే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇచ్చి చూడు..’ అంటూ బీజేపీ, కాంగ్రెస్ విసిరిన సవాల్ పట్ల కేసీయార్ సానుకూలంగా స్పందించారా.? లేదంటే, సిట్టింగుల్నే కొనసాగించడానికి ఇంకేదన్నా బలమైన కారణం వుందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కేసీయార్ తీసుకున్నది మాత్రం సాహసోపేతమైన నిర్ణయమే.

తన విషయంలోనూ అంతే.! రెండు చోట్ల పోటీ చేయడం అనేది కేసీయార్‌కి కొత్త కాదు. గతంలో ఒకేసారి అసెంబ్లీకి, లోక్ సభకు పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారాయన. సో, రెండు చోట్ల ఈసారి పోటీ చేసినా, కేసీయార్.. రెండు చోట్లా గెలిచే అవకాశం వుంది.

కానీ, రాజకీయాలు మారాయనీ.. తెలంగాణలో కేసీయార్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత కూడా పెరిగిందనీ, అందుకే, కేసీయార్.. రెండు చోట్ల పోటీ ద్వారా సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది.

మరోపక్క, రెండు చోట్ల పోటీ చేయడమంటే, రెండు ప్రాంతాల్లో పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం వుంటుందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.