ఎంతైనా తండ్రి మనసు కదా?

సరిగ్గా గమనిస్తే గత మూడు నాలుగు రోజులుగా కేసీఆర్ చాలా సైలంటుగా ఉన్నారు.. ఎవరితోనూ మాట్లాడలేదంట. ఏదో ముభావంగా గడిపారంట. ప్రగతి భవన్‌ కే పరిమితమవ్వడం.. ఎవరినీ కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం చేశారంట. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా కేసీఆర్ ప్రవర్తన ఇలా ఉందంట.

అవును… తన కుమార్తె కవితను ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్న మూడు రోజులు కేసీఆర్ కొంత టెన్షన్‌ లోనే ఉన్నారంట. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారని, ఆత్మీయ సమ్మేళనాలను కూడా ఫాలో అప్ చేయలేదని అంటున్నారు. కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళుతుంటే.. ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ లను కూడా పంపించారు. కవితకు ధైర్యం చెప్పాలని సూచించారు. ఇలాంటివి రాజకీయాల్లో సర్వ సాధారణమని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటప్పుడే ధైర్యంగా నిలబడాలని కవితకు చెప్పి పంపారంట.

నిజానికి కేసీఆర్ కుటుంబంలో ఇప్పటివరకూ ఎవరికీ ఇలాంటి అనుభవాలు లేవు. ఉద్యమ సమయంలో కేసులు, జైళ్లు పాలు కావడం మినహా ఇటువంటి ఘటనలు ఏనాడూ చోటు చేసుకోలేదు. అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా… అరెస్ట్ వరకూ వెళతారన్న వరకూ వ్యవహారం రాలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ దూకుడు చూసి ఆయన కొంత అసహనానికి లోనయినట్లు చెబుతున్నారు. అందునా ఒక ఆడపిల్ల మీద లిక్కర్ స్కాం ముద్ర పడటం కూడా కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా బాధపడలేదని సన్నిహితులతో ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

అందుకే కవిత ఢిల్లీ వెళ్లిన మూడు రోజుల పాటు అటు పార్టీ కార్యక్రమాలు – ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను సైతం పూర్తిగా వదిలేసినట్లు చెబుతున్నారు. కొంత అన్యమనస్కంగా ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ఉన్నతాధికారులు సైతం వెనకడగు వేశారంటున్నారు. పంట నష్టం వంటి వివరాలపై కూడా ఆయనకు సమాచారం అందించేందుకు అధికారులు ధైర్యం చేయలేదంట. అయితే ప్రస్తుతం కేసీఆర్ కాస్త రిలాక్స్ గా కనిపిస్తున్నారని.. మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు సన్నిహితులు!

పెద్ద ఉద్యమ నాయకుడైనా.. ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా.. జాతీయస్థాయి పార్టీకి అధ్యక్షుడైనా.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా… అంతకంటే ముందు కేసీఆర్ కూడా ఒక ఆడబిడ్డ తండ్రే కదా! అందుకే కేసీఆర్ దిగాలైపోయారంట. రాజకీయ జీవితంలో, ఉద్యమ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న గుండే… కూతురు విషయానికి వచ్చేసారికి అల్లల్లాడిపోయిందట. ఎంతైనా తండ్రి మనసు కదా!