ప్రధాన మంత్రిని తెలంగాణ సీఎం గుర్తించడంలేదా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు షరామామూలుగానే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో పాల్గొనలేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఆయా కార్యక్రమాల్లో కేసీయార్ కూడా పాల్గొని వుండాల్సింది.

సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలకు కేసీయార్ దూరంగా వుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ బీజేపీ గుస్సా అవుతోంది. ‘ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.. వస్తే శాలువా కప్పుతాం, ప్రధాన మంత్రితో కూడా సన్మానం చేయిస్తాం..’ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు దేబిరిస్తున్నారు, కేసీయార్ మాత్రం ‘డోన్ట్ కేర్’ అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా ‘ప్రోటోకాల్’ ప్రకారం స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోడీ, తన తెలంగాణ పర్యటనలో ప్రారంభించారు. అయితే, ‘ప్రధాన మంత్రి వచ్చిన రైళ్ళను ప్రారంభించాల్సిన అవసరం ఏముంది.?’ అంటూ కొన్నాళ్ళ క్రితం కేసీయార్ ఎద్దేవా చేసిన విషయం విదితమే.

‘ముఖ్యమంత్రి రాకపోతేనేం..’ అని బీజేపీ లైట్ తీసుకోవడంలేదు. ‘బతిమాలుకుంటోంది.. విమర్శిస్తోంది..’ వెరసి, ఈ ఆట చూసి, కేసీయార్ ఎంజాయ్ చేస్తున్నారనుకోవాలేమో.!