కేసీయారే ముఖ్యమంత్రి.! బీఆర్ఎస్ ధీమా.!

ఎగ్జిట్ పోల్ అంచనాలెలా వున్నాగానీ, కేసీయార్ హ్యాట్రిక్ ఖాయమట.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని కుండబద్దలుగొట్టేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ‘అధికారంలోకి వచ్చేది మేమే..’ అంటూ, ముఖ్యమంత్రి స్థాయిలో హంగామా చేసేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే, రేవంత్ పగటి కలలు కంటున్నాడని బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది.

బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ‘డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరుగుతుంది’ అంటూ ఓ ట్వీటొచ్చింది.

ఎగ్జిట్ పోల్ అంచనాల్ని బీఆర్ఎస్ ఇప్పటికే లైట్ తీసుకుంది. కేటీయార్ ఈ మేరకు పోలింగ్ జరిగిన రోజే స్పష్టం చేసేశారు.. తామే అధికారంలోకి మళ్ళీ రాబోతున్నామని. మరోపక్క, ‘కేసీయార్ హ్యాట్రిక్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, మూడోసారి మాత్రం కొంత వ్యతిరేకతను తెలంగాణ సమాజం నుంచి ఎదుర్కొంటున్నమాట వాస్తవం.

అయినాగానీ, త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ లాభపడినట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహుశా అదే, బీఆర్ఎస్ ధీమా అనుకోవాలేమో.! కాగా, బీఆర్ఎస్ ధీమాపై సెటైర్లేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుందనీ, బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఈసారి చెల్లదని కాంగ్రెస్ అంటోంది.