తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రసహనం నడుస్తోంది. ప్రసహనం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఎన్నికల నగారా మోగినాగానీ.. ఎన్నికలంటే వుండాల్సిన హంగామా అయితే ఎక్కడా కనిపించడంలేదు.
అధికార భారత్ రాష్ట్ర సమితి, ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించేసినా.. కింది స్థాయిలో రచ్చ తప్ప, ప్రచార కార్యక్రమాల్లో జోరు కనిపించడంలేదు. కాంగ్రెస్, బీజేపీలతో పోల్చితే, బీఆర్ఎస్ ప్రచారం కాస్త మెరుగు అంతే.! అధికార పార్టీ గనుక, ఆ మాత్రం ఎడ్జ్ వుంటుంది. అయినాగానీ, వుండాల్సిన హంగామాతో పోల్చితే, వున్నహంగామా చాలా చాలా తక్కువ.
‘ఇవేం ఎన్నికలు.?’ అని జనం ఆశ్చర్యపోతున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో అయితే పరిస్థితి మరీ దారుణం.! ఇక, ఈ వ్యవహారం చూసి, ‘కేసీయార్ గ్రాఫ్ పడిపోయింది..’ అన్న ప్రచారం జోరందుకుంది. అందులో కొంత వాస్తవం లేకపోలేదు కూడా.
‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పేరు వున్నప్పుడు కేసీయార్ ఇమేజ్ వేరు, పార్టీ పేరు ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారాక, కేసీయార్ వ్యవహారం వేరు. ఆ తెలంగాణ సెంటిమెంటుని, కేసీయార్‌కి అన్వయించుకున్నప్పటి ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు కనిపించడంలేదని గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.
కేసీయార్ గ్రాఫ్ తగ్గింది.. కానీ, కాంగ్రెస్ అలాగే బీజేపీ గ్రాఫ్ పెరిగిందా.? అంటే, అదీ లేదు. అక్కడే గులాబీ పార్టీకి ఎడ్జ్ లభిస్తోంది. కాకపోతే, గత ఎన్నికల కంటే కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం వుంది.
‘ముచ్చటగా మూడోసారీ అధికారంలోకి మేమే వస్తాం’ అని చెప్పుకుంటున్న గులాబీ శ్రేణులు, ఓటరు నాడిని సరిగ్గా పట్టుకోవడంలో మాత్రం కొంత ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే.