తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్‌ని నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పరామర్శించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత, అర్థరాత్రి బాత్రూములో జారిపడ్డంతో కేసీయార్ తుంటి ఎముకకి గాయమైన సంగతి తెలిసిందే. ఆ తుంటి ఎముకకు సంబంధించి మార్పిడి చికిత్స జరిగింది.
ప్రస్తుతం కేసీయార్ కోలుకుంటున్నారు ఆసుపత్రిలో. అయినా, ‘తొలి ముఖ్యమంత్రి’ ఏంటి.? ఇద్దరూ మాజీలే కదా.? నువ్వూ ఓడిపోయావ్.. నేనూ ఓడిపోయాను.. అని కేసీయార్, చంద్రబాబు పరస్పరం చెప్పుకుని వాపోయారా.? సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు ఇవే మరి.
ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకుండా చంద్రబాబు గడప దాటరన్న వాదన వుంది. మరి, ఏ రాజకీయ లబ్ది ఆశించి, కేసీయార్‌ని పరామర్శించేందుకు చంద్రబాబు హైద్రాబాద్ వెళ్ళినట్లు.? కేసీయార్‌తో చంద్రబాబు ఏం మాట్లాడినట్లు.? ఏకాంతంగా ఏమీ మాట్లాడలేదు గనుక, ప్రస్తుతానికి ఇందులో రాజకీయం చూడలేం.
అయితే, కేసీయార్ – చంద్రబాబు మధ్య జాతీయ రాజకీయాలకు సంబంధించిన చర్చలకు తొలి అడుగు పడిందన్న గుసగుసలు అయితే ఇటు టీడీపీ అటు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
కేసీయార్ అంటే, ఒకప్పుడు చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసిన వ్యక్తే.! అది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత కేసీయార్, చంద్రబాబుని రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కాదు, శతృవులా కూడా చూశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందర్నీ కలుపుకుపోవడం ఇప్పుడు కేసీయార్‌కి కూడా అవసరం.
బీజేపీ ధాటికి చంద్రబాబు విలవిల్లాడారు. కేసీయార్ పరిస్థితీ అదే.! సో, అలా ఆ ఇద్దరూ కలిసేందుకు మార్గం సుగమం అయ్యిందన్నమాట. కానీ, బీజేపీతో సఖ్యత కోసం కేసీయార్ ప్రయత్నిస్తున్నారు కదా.? ఇది కూడా లాజిక్కే మరి.!