ఫోన్లు ఓపెన్‌ చేస్తున్నాం రండి.. కవితకు ఈడీ బిగ్‌ ట్విస్ట్‌!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌ లో కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవితకు.. తాజాగా ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్‌ ఫోన్లు తెరిచేందుకు సిద్దమయ్యామని ఆ లేఖలో తెలిపారు. దీంతో… మళ్లీ మొదలైందిరా బాబూ టెన్షన్ అంటూ నిట్టూరుస్తున్నారంట బీఆరెస్స్ శ్రేణులు.

వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఫోన్లను ఓపెన్ చేసి, డేటా రికవరీ చేస్తున్నారు ఈడీ అధికారులు. మార్చి 28వ తేదీ మంగళవారం “ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. మీరు హాజరుకావాలి” అంటూ కవితకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే తాను రాలేనని.. తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ఆథరైజేషన్ గా హాజరవుతారని కవిత సమాధానమిచ్చారు. అందుకు ఈడీ అంగీకరించడంతో… ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత.. తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ను ఆఫీసుకు పంపించారు.

మార్చి 21వ తేదీన లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన కవిత.. తాను ఉపయోగించిన ఫోన్లను అధికారులకు అందజేసిన సంగతి. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేయని అధికారులు తాజాగా మార్చి 28వ తేదీన టెక్నికల్ టీం సాయంతో ఆ ఫోన్లలోని డేటా తీసుకోవటానికి.. కవితను పిలిచారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవిత ఫోన్లలోని డేటా రికవరీ కార్యక్రమం సాగుతుంది.

నిజానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్‌ టాపిక్‌గా మారారు. ఆమె ఈడీ విచారణకు హాజరైన ప్రతిసారీ.. కవితను అరెస్ట్‌ చేస్తారా? కవిత సేఫ్‌గా తిరిగి ఇంటికొస్తారా? అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కవిత ఈడీకి సమర్పించిన మొబైల్స్‌ కొత్తవా? పాతవా? అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ఫోన్ల చుట్టూనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. మరి ఈడీ ఓపెన్‌ చేసే కవిత ఫోన్స్ లో ఏముంది అనేది తెలియాలంటే వేచి ఉండాల్సిందే!