గులాబీ తోటలో ‘కవిత’.! తామర పువ్వుల బాణమట.! అసలేం జరుగుతోంది తెలంగాణలో.? తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఇద్దరి మహిళల చుట్టూ కేంద్రీకృతమైపోయింది. నిన్న హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారంతో, చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల మీద విమర్శలకు సోషల్ మీడియాని వాడుకున్నారు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత.! ”తాను వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’..” అంటూ టకవిత ట్వీటేయగా, ఆ ట్వీటుపై వైఎస్ షర్మిల కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవ లేదు..’ అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు ట్విట్టర్‌లో. సరిపోయింది సంబరం.! ఇద్దరు మహిళలు.. రాజకీయాల్లో ఒకర్నొకరు ప్రోత్సహించుకోకపోయినా ఫర్లేదు, ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని, సభ్య సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు.?
ఒకరేమో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమార్తె.. ఇంకొకరేమో దివంగత మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. సభ్య సమాజానికి వీరిద్దరి ‘నడత’ ఎంత ఆదర్శంగా వుండాలి.? వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటి పెట్టుకున్నారు. ఆ పార్టీ ఏం అవుతుందన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఈలోగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ఉలిక్కిపడాలి.? పైగా, కవిత రంగంలోకి దూకి, ‘బాణం’ అని సెటైర్లేయడం వల్ల లాభమేంటి.? చిత్రమేంటంటే తెలంగాణ గవర్నర్ కూడా షర్మిల అరెస్టు వ్యవహారంపై స్పందించడం. బీజేపీ కూడా ఆమెకు బాసటగా నిలుస్తోంది. విషయం కాస్త తేడాగానే కనిపిస్తోంది. అందుకే, గులాబీ పార్టీ తెలివిగా కవితను రంగంలోకి దించినట్లుంది.
కానీ, కవితని వైఎస్సార్టీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు బూతులు తిడుతోంటే, షర్మిలని తెలంగాణ శ్రేణులు బూతులు తిడుతున్నాయ్. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.