ప్రస్తుతం సినీ తారలు, రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు కూడా చెయ్యి, మెడలపై కరుంగలి మాల కనిపిస్తోంది. ఈ నల్లటి చందనం లేదా ఎబోనీ చెక్కతో తయారు చేసే ఈ మాలను ధరించేవారికి ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణ కవచంలా పని చేస్తుందని చెబుతున్నారు పండితులు. ఈ కరుంగలి చెక్కకు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి, పాజిటివ్ ఎనర్జీని ఉంచే సామర్థ్యం ఉందని అంటున్నారు.
అంతేకాదు చెడు దృష్టి, దుష్ట శక్తులు దరిచేరకుండా చూడటమే కాకుండా, ఆత్మీయంగా ప్రశాంతతను కలిగిస్తుందట. ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎక్కువగా ధరిస్తున్న కారణం అదే.. మనసు నిర్బంధం తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని విశ్వాసంతో చాలా మంది దీనిని ధరిస్తున్నారు.
ప్రజల నమ్మకం ప్రకారం, కరుంగలి మాల ధరిస్తే జ్ఞాపకశక్తి బలపడుతుంది, ముఖ్యంగా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఇది మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇస్తుందని చెబుతారు. జ్యోతిష్య నిపుణులు అయితే మరింత దూరం వెళ్తూ, కుజ గ్రహ దోషాలను నివారించడానికి, శని దోషాలను తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు. శరీర వేడి తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెంచడం, రక్తపోటు నియంత్రణ, నిద్రలేమి సమస్యలు తగ్గించడం లాంటి అంశాల్లో సహాయపడుతుందట. కొందరు పరిశోధకుల ప్రకారం, ఈ చెక్కలోని కొన్ని సమ్మేళనాలు చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గిస్తాయని సూచిస్తారు.
ధ్యానం చేసే వారికి ఈ మాల ఎంతో ఉపయుక్తం. మూలాధార చక్రానికి శక్తి ఇస్తుందట. అలాగే, పూర్వకర్మ రుణాలను తీరుస్తుందని, దైవిక అనుభూతిని కలిగిస్తుందని కొందరు నమ్మకం. అయితే, ఇవన్నీ ఎక్కువగా సంప్రదాయ విశ్వాసాలే. శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కరుంగలి మాలను ధరిస్తూ ఆచారాలను పాటించడం, పరిశుభ్రత కాపాడటం ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.