ఆయనను న్యాయమూర్తి అని పిలిస్తే న్యాయదేవత కన్నీరు పెట్టుకుంటుందేమో? బీహార్ హైకోర్టు నుంచి పనిష్మెంట్ బదిలీతో ఆంధ్రప్రదేశ్ కు తరిమివేయబడిన రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టినప్పటినుంచి చంద్రబాబు మనిషిగానే…ఇంకా చెప్పాలంటే బానిసగానే వ్యవహరించాడు. తన అధికారపరిధిని మించి వ్యాఖ్యలు చెయ్యడం, జగన్మోహన్ రెడ్డి మీద పచ్చమీడియా కన్నా కూడా ఘోరంగా, నీచంగా విషాన్ని కుమ్మరించడం, ప్రజలెన్నుకున్న నేత మీద నిప్పులు చిమ్మడం, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం, అధికారుల మీద దూషణాపూరిత వ్యాఖ్యలు చెయ్యడం ఆయన తన పనితీరుతో ఎపి హైకోర్టు పరువుప్రతిష్ఠలను మంటగలిపాడు.
సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం వల్లనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని వ్యాఖ్యానించడం, అందువలన జగన్ అనుచిత లబ్దిని పొందాడని దుర్వ్యాఖ్యలు చెయ్యడం, జగన్ కేసుల విచారణలు ఆలస్యం అవుతాయేమో అన్న సందేహాన్ని వ్యక్తం చెయ్యడం చూస్తుంటే గుమ్మడికాయల దొంగ సామెత గుర్తుకొస్తుంది. అసలు జగన్ కేసుల గూర్చి బెంచ్ మీద కూర్చుని రాకేష్ కుమార్ ఎలా వ్యాఖ్యలు చేస్తారు? దీన్నిబట్టి చూస్తుంటే ఆయనను ఏపీకి బదిలీ మీద పంపించినవారి అసలు అజెండా ఏమిటో స్పష్టంగా తెలుస్తున్నది. తాను ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చెయ్యలేకపోయానేమో అన్న బాధ, తనను పంపించినవారి ఋణం తీర్చుకోలేకపోయాయనే ఆవేదన, ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. సరైన సమయంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే “రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని” ఆయన ఆరోజే తీర్పు ఇచ్చి ఉండేవాడు. తన ధర్మాసనం ఇచ్చిన అన్ని ప్రొసీడింగ్స్ ను సుప్రీమ్ కోర్ట్ నిలిపివేసిన క్షణమే ఆయన ఆ పవిత్రమైన పదవిలో కొనసాగే హక్కును కోల్పోయాడు.
ఒక న్యాయమూర్తి మీద సందేహాలు ఉన్నప్పుడు ఆయనను తప్పుకోమని ప్రభుత్వం ఒక పిటీషన్ వేస్తె దాన్ని మరొక న్యాయమూర్తి బెంచ్ విచారించాలి తప్ప తనకు తాను విచారణ చెయ్యడం ఏమిటి? ఆయనను ఆయన అనుమానాస్పదుడుగా ప్రకటించుకుని బెంచ్ నుంచి తప్పుకుంటాడా? ఆయనకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, తక్షణమే తాను వైదొలుగుతూ మరొక ధర్మాసనంతో ఆ పిటీషన్ ను విచారించమని ప్రధాన న్యాయమూర్తిని కోరాలి. అలా చెయ్యకుండా తాను వైదొలగనని, పైగా అలా కోరడం కోర్ట్ ధిక్కరణ అని తీర్పు ఇవ్వడం ఏమిటి?
తన హద్దులు దాటి సుప్రీంకోర్టు కొలీజియం ను కూడా తప్పుపట్టే సాహసానికి తెగించిన రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థలో ఒక్క క్షణం కూడా ఉండదగినవాడు కాదు. ఆయన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఏదోవిధంగా మళ్ళీ కేసులతో విధించాలని, ఆయనను జైలుకు పంపించాలనే దుష్టబుద్ధితోనే పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రాకేష్ కుమార్ గత ఏడాదిగా ఇచ్చిన తీర్పులు అన్నింటినీ సమీక్షించాలని, అవి న్యాయవిరుద్ధం అయిన పక్షంలో వాటిని రద్దు చెయ్యాలని సుప్రీమ్ కోర్టులో పిటీషన్ వెయ్యాలి. అవసరం అయితే రాకేష్ కుమార్ ను కోర్ట్ బోనులో నిలుచోబెట్టాలి. ఆయన ఇచ్చిన తీర్పులు న్యాయవిరుద్ధం అయితే ఆయనను కఠినంగా శిక్షించి మళ్ళీ మరే న్యాయమూర్తి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు