వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి సోదరుల పాపం పండిందని, బడుగు బలహీన వర్గాలను హింసించిన ఈ నరహంతకులకు జైలు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో జూలకంటి ఈ వ్యాఖ్యలు చేశారు.
అరాచక శక్తుల ఆగడాలు: మాచర్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పిన్నెల్లి సోదరులు సాగించిన అరాచకాలను జూలకంటి ఎండగట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, మాచర్లను రావణకాష్ఠంలా మార్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలపై తాలిబన్ల తరహాలో దాడులకు తెగబడి, నియోజకవర్గాన్ని ఆటవిక రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. పిన్నెల్లి అరాచకాలకు ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

పిన్నెల్లి రాజ్యాంగం – దోపిడీ పర్వం: జగన్‌మోహన్‌రెడ్డి అండతో పిన్నెల్లి సోదరులు వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని జూలకంటి విమర్శించారు. గత ఐదేళ్లలో ఇక్కడ భారత రాజ్యాంగం కాకుండా ‘పిన్నెల్లి రాజ్యాంగం’ అమలైందన్నారు. భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలు, సహజ వనరుల దోపిడీతో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారని ఆరోపించారు. చివరకు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడం, సీఐపైనే హత్యాయత్నం చేయడం వారి బరితెగింపు చర్యలకు నిదర్శనమని అన్నారు.

న్యాయం గెలిచింది: మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాలను తమ వ్యక్తిగత జాగీరుగా మార్చుకున్న ఈ ఇద్దరు నరరూప రాక్షసులు నేడు చట్టం ముందు దోషులుగా నిలబడ్డారని జూలకంటి పేర్కొన్నారు. “వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలింది” అన్న సామెత పిన్నెల్లి సోదరులకు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు ఊరికే పోవని, సుప్రీంకోర్టు తీర్పుతో మాచర్ల ప్రజలు ఎదురుచూస్తున్న న్యాయం దగ్గరలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

