ఏపీలో ఈసీ కష్టాలు పగోడికి కూడా రాకూడదంట!!

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కమిషన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా మారిందనే కామెంట్లు సామాన్య ప్రజానికంలో సైతం బలంగా వినిపిస్తుండటం గమనార్హం. పైగా పిన్నెల్లి వీడియోపై ఎన్నికల కమిషన్ స్పందించిన విధానంపై మరింతగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అధికారులపై చర్యల విషయంలో వారు అనుసరించిన విధానం ఇంకాస్త కామెంట్లు వినిపించడానికి కారణం అయ్యిందని చెబుతున్నారు.

అవును… మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారంటూ నెట్టింట ఒక వీడియో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఫేక్ వీడియో అని.. ఇది నిజంగా వెబ్ క్యాస్టింగ్ కి సంబంధించిన వీడియోనే అయితే.. అది లోకేష్ చేతికి ఎలా వెళ్లింది.. వెళ్లిందని తెలిసిన తర్వాత ఈసీ తీసుకున్న చర్యలేమిటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సమయంలో ఊహించని రీతిగా అన్నట్లుగా పాల్వాయిగేట్ పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా… వారిద్దర్నీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వనందువల్లే వారిద్దర్నీ సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చామని సీఈఓ ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

ఇక్కడ సరిగ్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఈనెల 13న ఈవీఎం పగలగొట్టిన ఘటన జరిగితే.. అదే రోజు వెబ్ క్యాస్టింగ్ లో ఆ ఘటన వీడియో ఫుటేజీ రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇదే సమయంలో… ఈవీఎం పగలగొట్టనప్పుడు లోపల అంత హడావిడి జరిగితే అక్కడున్న పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. లోపల ఉన్న అధికారులు ఫిర్యాదు చేసే ఉంటారని చెబుతున్నారు!

పీవో & కో ఫిర్యాదు చేయడంతో పాటు.. లోపల అంత గలాటా జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఎస్పీకి విషయం చెప్పే ఉంటారని అంటున్నారు. వీరితో పాటు విషయం తెలిసిన అనంతరం ఇతర అధికారులు ఏం చేస్తున్నారు.? ఇక వెబ్ క్యాస్టింగ్ పరిశీలించే కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటుంది. ఆరోజు వీడియో రికార్డ్ అయితే కలెక్టర్ ఏం చేస్తున్నట్టు. అది లోకేష్ చేతికి ఎలా వెళ్లిందనే విషయంలో కలెక్టర్ బాధ్యులు కాదా?

ఇన్ని తప్పులు చేశారు కాబట్టే వారిని ఈసీ ముందుగానే సస్పెండ్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు వస్తుండేసరికి పీఓ, ఏపీఓపై వేటు వేసినట్టు తెలుస్తోంది. దీంతో… ఘటన జరిగిన 10రోజులకు పోలింగ్ సిబ్బందిపై వేటు వేయడమేంటనే ప్రశ్నలు వినపడుతుండటం గమనార్హం.

సరే ఆ సంగతి అలా ఉంటే… పిన్నెల్లి వీడియో విషయంలో ఏపీ సీఈవో మాటలు విన్నవారు జాలిపడుతున్నారని అంటున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఎలా బయటకు వెళ్లిందో తనకు తెలియదంటూ సీఈవో చేసిన వ్యాఖ్యలు ఆయన తాజా పరిస్థితిని అద్ధం పడుతున్నాయని చెబుతున్నారు. ఆ వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని.. దర్యాప్తు సమయంలో ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లిందన్నట్లుగా ఆయన చెబుతున్నారు.

దీంతో… టీడీపీ నేతలతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందనే స్థాయిలో కామెంట్లు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో… మాచర్లలో ఈవీఎం పగలగొట్టడంతోపాటు ఆరోజు చాలానే అరాచకాలు జరిగాయని.. అవి మాత్రం బయటకు రానివ్వడంలేదని.. టీడీపీపై తప్పులేకుండా చేసేందుకే ఈసీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోపక్క టీడీపీ నుంచీ విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇందులో భాగంగా… హౌస్ అరెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేని ఇల్లు దాటించేసి, ఇప్పుడు అరెస్ట్ పేరుతో హడావిడి చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. దీంతో… అటు టీడీపీ నేతలూ విమర్శలు గుప్పిస్తూ.. ఇటు వైసీపీ నేతలూ విరుచుకుపడుతుండటంతో ఎన్నికల కమిషన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయినట్లుందని అంటున్నారు పరిశీలకులు!