కామెంట్… ఏపీలో ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంపై నీలి నీడలు!?

ఎన్నికల కమిషన్ అంటే చాలా నిస్పక్షపాతంగా నడుచుకుంటుందని అంతా భావిస్తారు.. అది నిజమని నమ్ముతారు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో వీరిపాత్ర అత్యంత కీలకం అని చెబుతారు! అయితే… తాజాగా ఏపీలో జరిగిన పోలింగ్.. ఆ సమయంలో జరిగిన పలు అవాంఛనీయ ఘటనలు.. వాటిపై ఎన్నికల కమిషన్ రియాక్షన్ అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతుందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు ఘటనలు ఎన్నికల కమిషన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయనే విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. టీడీపీతో కుమ్మక్కై ఏపీలో ఈసీ పని చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చే ఉదాహరణాలూ తెరపైకి వస్తుండటం గమనార్హం.

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమయ్యాయి! అయితే వీటిలో ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అసలు ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఎందుకు బయటపెట్టడం లేదనేది సామాన్యుడికి అర్ధం కానివిషయంగా మారిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఆ ఘటనకు సంబంధించిన వీడియోను తాము రిలీజ్‌ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నారా లోకేష్‌ “ఎక్స్‌” వేదికగా ఆ వీడియో పోస్టు కావడం గమనార్హం. ఇక్కడే అసలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈసీ క్రెడిబిలిటీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

అసలు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉండాల్సిన వీడియో.. టీడీపీ నేత నారా లోకేష్‌ చేతికి ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఇక మిగిలిన ప్రాంతాలైన రెంటచింతల మండలం తుమృకోటలో వైసీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే 203, 204, 205 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు! తర్వాత కొత్త ఈవీఎంలను తెప్పించి ఆ సమయంలో వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్‌ చేశారని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. ఒప్పిచర్లలో వైసీపీ పోలింగ్‌ ఏజెంట్‌ శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు దాడి చేసి పోలింగ్‌ కేంద్రం నుంచి ఈడ్చేశారనీ.. అదీ ఈసీకి కనిపించలేదనేది మరో బలమైన ఆరోపణగా ఉంది.

వాస్తవానికి పిన్నెల్లికి సంబంధించినదిగా చెబుతున్న వీడియో వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్‌ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23:52 గంటలు ఉండగా 12:06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్‌ లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. అసలు ఈసీ పరిధిలో ఉండే వీడియోలను ఎవరు మొబైల్ లో షూట్ చేసే అవకాశం కలిగి ఉన్నారనేది మరో సందేహం!

దీంతో… పిన్నెల్లి వ్యవహాంలో చర్యను హైడ్ చేసి ప్రతిచర్యను మాత్రమే పబ్లిక్ లోకి అక్రమంగా తెచ్చారనే చర్చా మొదలైంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని కోరుతున్నారు ప్రజానికం. వీడియో బైట్లు పెట్టడం దేనికి.. మొత్తం వీడియో ఎందుకు దాస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి ఈసీ స్పందిస్తుందా.. లేక, తమను ఎవరూ ప్రశ్నించకూడదని, ప్రశ్నించినా స్పందించమని ఉంటుందా అన్నది వేచి చూడాలి!