హైదరాబాద్ లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన కేంద్రమంగా మారబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ, ప్రతిపక్షాలు, కొత్త రాజకీయ శక్తులు అన్నీ ఈ ఒక సీటు కోసం పావులు కదుపుతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయనుండటంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలవుతోంది.
నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు జరుగుతుంది. అభ్యర్థులు జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో నామినేషన్లు సమర్పించవచ్చు. ప్రభుత్వ సెలవులను మినహాయించి అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. అక్టోబర్ 24 వరకు అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుంది. పోలింగ్ నవంబర్ 11న జరగగా… కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది.
ఈసారి ఎన్నికల నిర్వహణలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. అభ్యర్థులు ENCORE పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఆన్‌లైన్ ఫారమ్‌తో పాటు QR కోడ్ ఉన్న హార్డ్ కాపీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిట్ ఆన్‌లైన్ బ్యాంక్/ ట్రెజరీలో క్రెడిట్ కాలేని పక్షంలో మాన్యువల్ డిపాజిట్ చేయాలి. మరిన్ని వివరాలకు రిటర్నింగ్ ఆఫీసర్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,367 మంది, మహిళలు 1,91,590 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులలో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు. అదనంగా 95 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 18 మంది సర్వీస్ ఎలక్టోరల్స్, 1,891 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు నమోదు అయ్యారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున భారీ భద్రతా ఏర్పాట్లకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రాజకీయంగా జూబ్లీహిల్స్ సీటు ఎప్పటినుంచో ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, వ్యాపార వర్గం, సెలబ్రిటీల ఓటింగ్ ప్యాటర్న్ ఈ నియోజకవర్గంలో నిర్ణాయక పాత్ర పోషిస్తుంది. ఇదే కారణంగా అన్ని పార్టీలు ఈ సీటును గెలుచుకోవడానికి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రతి పార్టీ ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేయనుంది.
వీధి వీధిలో, సోషల్ మీడియాలో ఎన్నికల చర్చలు మొదలయ్యాయి. బలమైన అభ్యర్థి, స్పష్టమైన వ్యూహం ఎవరిదో అనేదే ఈసారి ఫలితాన్ని నిర్ణయించే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటుకే పరిమితం కాదు.. రాబోయే రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు దిశనిర్దేశం చేసే సూచికగా మారే అవకాశం ఉంది.
