ఔను, జూనియర్ ఎన్టీయార్ నేరుగా తాతయ్యకే షాక్ ఇచ్చాడు. హైద్రాబాద్‌లో స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు సంబంధించిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ డుమ్మా కొట్టాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ పెద్దలు స్వయంగా జూనియర్ ఎన్టీయార్‌ని పిలిచి, కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరారు.
కానీ, తన పుట్టినరోజునాడు కుటుంబ పరమైన కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి వున్నందున.. అనే ‘కుంటి సాకు’ చూపి, జూనియర్ ఎన్టీయార్, తన తాత స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు చెప్పాడు.
‘మా తాత..’ అంటూ పదే పదే వేదికలెక్కి స్టేట్మెంట్లు దంచే జూనియర్ ఎన్టీయార్, ఇలా తన పుట్టినరోజునాడు పెట్టుకున్న ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో, తాతగారి జయంతి వేడుకలకు డుమ్మా కొట్టడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
స్వర్గీయ ఎన్టీయార్ శతజయంతి వేడుకల్ని టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. ఆ టీడీపీకి దూరంగా వుండాలన్నది జూనియర్ ఎన్టీయార్ ఉద్దేశ్యం. టీడీపీలో గతంలో తనకు ఎదురైన అవమానాల నేపథ్యంలో ఆయన టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు.
కొన్నాళ్ళ క్రితం హరికృష్ణ కుమార్తె టీడీపీ తరఫున కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తే, సోదరి తరఫున జూనియర్ ఎన్టీయార్‌గానీ, కళ్యాణ్ రామ్‌గానీ ప్రచారం నిర్వహించలేదు. అది రాజకీయం అనుకోవచ్చు.
కానీ, ఇదేంటి.? ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీయార్ హాజరు కాకపోవడం పెద్ద తప్పిదమే.!