ప్రధాని రేసులో కేసీ‌ఆర్… తెరపైకి “బిజినెస్ మేన్”లో మహేష్ డైలాగ్!

“ఇండియాలో ఎంపీగా పోటీచేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే ఇస్తా. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావలా వేసుకుందా.. ఈసారి ఎలక్షన్ కి వేల కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా”… అంటూ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ చెప్పిన ఎన్నికల ఖర్చుల లెక్క డైలాగ్ ఇప్పటికీ సంచలనమే! ఆ డైలాగ్ సంగతి కాసేపు అలా పక్కనుంచుకుని… విషయంలోకి వెళ్దాం…!

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆరెస్స్ కాస్తా.. రాష్ట్ర విభజన అనంతరం ఫక్తూ రాజకీయ పార్టీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ… ఇప్పుడు జాతీయస్థాయిలో సైతం చక్రం తిప్పాలని భావించింది. ఫలితంగా… టీఆరెస్స్ కాస్తా బీఆరెస్స్ గా మారింది! దీంతో… “దేశ్ కా నేతా కేసీఆర్” అనే స్లోగన్ ని జనాల్లోకి వదులుతున్నాయి బీఆరెస్స్ శ్రేణులు.

ఈ క్రమంలో… బీజేపీయేతర కూటమికి తాను చైర్ పర్సన్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అంటే… ప్రధాని పదవిపై కేసీఆర్ ఆశపడుతున్నారని అర్ధం. ఎందుకంటే… ఏదైనా ఒక కూటమి ఏర్పాటై, ఎన్నికల్లో గెలిస్తే.. ఆ కూటమికి చైర్‌ పర్సన్‌ గా ఉన్న వ్యక్తే ప్రధాని అవుతుంటారు. ఇది రాజకీయాల్లో ఒక ఆనవాయితీగా వస్తుంది. సో.. కేసీఆర్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకు పోతున్నారట!

అవును… “బీజేపీయేతర ప్రతిపక్షాల కూటమికి నన్ను చైర్‌ పర్సన్‌ ను చేయండి. 2024 పార్లమెంటు ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఖర్చును నేను చూసుకోడానికి సిద్ధంగా ఉన్నాను అని.. కేసీఆర్ తన సన్నిహితులతో జరిపిన ఒక ప్రైవేటు కాన్వర్జేషన్‌ లో ఈ విషయాన్ని చెప్పారు. నిజంగా ప్రతిపక్షాలు ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తాయా? అందరినీ కాదని ఆయనకు ఆ బాధ్యతలు ఇస్తారా? బహుశా సాధ్యం కాకపోవచ్చు”… ఇదీ సీనియర్ జర్నలిస్టు రాజ్‌ దీప్ సర్దేశాయ్ తన సొంత యూ-ట్యూబ్ చానెల్‌ లో “మోడీ వర్సెస్ ఆల్” అనే అంశంపై విశ్లేషణ సందర్భంగా చేసిన కామెంట్. ప్రస్తుతం ఈ కామెంట్ తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ప్రజలకే కాదు.. దేశంలోని ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కేసీఆర్ కు ప్రసాదించాలంటూ యాగాలు, యజ్ఞాలూ చేస్తున్న బీఆరెస్స్ శ్రేణుల పూజల వెనక పరమార్ధం ఇదే అని పరోక్షంగా చెబుతున్నారు రాజ్ దీప్!! ఈ చర్చోపచర్చలన్నీంటికీ ప్రధాన కారణం… రాజ్‌ దీప్ చేసిన ఈ తాజా రాజకీయ విశ్లేషణ! పైగా… తనను చైర్‌ పర్సన్‌ గా నియమిస్తే ఎన్నికల క్యాంపెయిన్‌ కు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని రాజ్‌ దీప్ చెప్పడంతో… జాతియ స్థాయిలో ఎన్నికలకు ఎంత ఖర్చవుతుంది? కేసీఆర్ దగ్గర అంత సొమ్ముందా? అంటూ బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు… ఎన్నికల్లో ఎంత ఖరవుతుందంటూ వేసిన లెక్కలు వేస్తున్నారు జనాలు!

దీంతో… ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌ కు, పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ కు, తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి కూడా… కేసీఆర్ ఫండింగ్ చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సొమ్మంతా… తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచి, కమిషన్ల ద్వారా సంపాదించిందేననేది వారి వాదన!

ఇన్ని విశ్లేషణలు – ఇన్ని ఆరోపణల మద్య సాగుతున్న ఈ వ్యవహారంపై మరిన్ని విషయాలు తెలియాలంటే… కేసీఆర్ స్పందన కోసం వేచి చూడటం తప్ప మరో ఆప్షన్ లేదు.

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో స్వయంగా హైదరాబాద్‌ కు వచ్చిన రాజ్ దీప్ సర్దేశాయ్.. ఎన్నికల క్యాంపెయిన్‌ లో ఉన్న కేసీఆర్‌ ను ఇంటర్వ్యూ చేశారు. స్థానిక పరిస్థితులు – తెలంగాణలో టీఆరెస్స్ పరిస్థితులపై విశ్లేషణ చేశారు. దీంతో… కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను రాజ్‌ దీప్ సర్దేశాయ్ గత కొంతకాలంగా నిశితంగానే గమనిస్తున్నారని.. ఫలితంగానే ఈ కామెంట్లు చేశారని అంటున్నారు!

బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ ఫుల్ డైలాగ్:

“ఇండియాలో ఎంపీగా పోటీచేసే ఏ క్యాండిడేట్ అయినాసరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే ఇస్తా..!

లాస్ట్ టైం ఒక్క అహ్మదాబాద్ లోనే అరవై ఐదు కోట్లు ఖర్చయ్యింది. జైపూర్ పాతిక – జైసల్మీర్ 33 – జబల్ పూర్, కాన్ పూర్, కోల్ కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్ కోట్, పనాజీ, నాసిక్, బేంగళూర్, కొచ్చి, కొల్లాం, ఉడిపి… ఇలా డ్యాష్ తీరిపోయే సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అన్నిసార్లూ ఓటు ఐదొందలకు దొరకదు. కొన్నిసార్లు 5000 కూడా పెట్టాల్సొస్తాది. ప్రాణంపోయినా పర్లేదు.. “%$#బీప్” తీరిపోయే సెంటర్లు కొన్నుంటాయి.. అక్కడ ఎంత ఖర్చవుతుందో ఎవడికీ తెల్లియదు.

లాస్ట్ టైం ఎలక్షన్స్ ని 25వేల కోట్లయ్యింది.. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావలా వేసుకుందా.. ఈసారి ఎలక్షన్ కి 35వేల కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా…”