జియో వినియోగదారులు కుయ్యో మొర్రో అంటున్నారు.

ఒక్కసారిగా రీఛార్జి ధరలు విపరీతంగా పెంచేసి జియో వినియోగదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జియోతో పాటు ఎయిర్ టెల్.. ఐడియా కూడా రీఛార్జి రేట్లను పెంచాయి.అయితే ప్రధానంగా జియో గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే జియో ఇన్నాళ్లు ఏం చెప్పింది.. ఏ నెట్వర్క్ కూడా ఇవ్వని తక్కువ చార్జీలతో మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఇతర మొబైల్ నెట్వర్క్ యూజర్లను తన పరిధిలోకి లాక్కుని మొబైల్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఎదిగింది జియో.ఇప్పుడు ఆ స్థాయి అందుకున్న తర్వాత విప్పింది పడగ..ఇప్పుడు జియో రింగు టోన్ శ్రావ్యంగా వినిపించడం లేదు.. పాము బుస మాదిరి ఉంది.ఇన్నాళ్లు జియో సేవలను కాస్త తక్కువ చార్జీలతో అనుభవించిన వినియోగదారులకు ఇప్పుడు కంపరం పుట్టుకొస్తోంది. మనమూ మిగిలిన వాళ్ల మాదిరే కదా.. జియోతో ఒరిగిందేమీ లేదనే కఠోర సత్యం ఇప్పుడు వినియోగదారులకు ఎరుక లోకి వచ్చింది.

నిజానికి జియో అనే కాదు.. ఆమాటకొస్తే మొబైల్ సంస్థలన్నీ కూడా వినియోగదారులను నట్టేట ముంచినట్టే… రకరకాల ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించి మొబైల్ వినియోగాన్ని అలవాటు చేసి.. పది రూపాయలు మొదలుకుని రీఛార్జి కార్డులు పెట్టి అతి సామాన్యులను..దిగువ మధ్యతరగతి ప్రజలను కూడా మొబైల్ వినియోగ పరిధిలోకి తెచ్చి.. నెట్టని .. యూ ట్యూబని.. ఇన్స్టాగ్రామని.. ఫేస్ బుక్కని.. ట్విట్టరని.. పరాకాష్టగా వాట్సాప్.. టెలిగ్రామ్.. ఈ మెయిల్.. ఎమెజాన్..నెట్ ఫ్లిక్స్.. ఇలా రకరకాల వేదికలు.. సినిమాలు.. ఆటలు..పెళ్ళిచూపులు..వ్యాపార ప్రకటనలు..ప్రయాణం టికెట్లు.. సినిమా టికెట్లు.. దైవ దర్శనాల టోకెన్లు.. ఫుడ్ ఆర్డర్లు..చెల్లింపులు.. చివరాఖరికి చదువులు.. అన్నిటికీ మొబైలే అన్న స్థాయిలో ప్రజలను ఫోనుకు బానిసలను చేసి ఇప్పుడు మొబైల్ సంస్థలు జూలు విదిలించాయి.

లైఫ్ టైమ్..అంటే జీవితకాలపు చెల్లుబాటు హుష్ కాకి అయిపోయింది. పది..ఇరవై..యాభై వంటి బుల్లి రీఛార్జి స్క్రాచ్ కార్డులకు కాలం చెల్లిపోయింది.ఒకవేళ కొన్ని సంస్థల్లో బుల్లి రీఛార్జిలున్నా వాటి చెల్లుబాటు గంటలు..మహా అయితే రోజులు..!..

ఇప్పుడేమైంది..ఇంటిల్లిపాదీ మొబైల్ వినియోగానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్లు.. అన్నిటికి అయితే 28 రోజులు..లేదంటే 84 రోజుల చెల్లుబాటు..ఇక్కడ మరో కిటుకు..ఒక రీఛార్జి నెలరోజులు పెట్టకుండా 28 రోజులు పెట్టడం దేనికి అంటే.. నెల చెల్లుబాటు అయితే ఏడాదికి పన్నెండు రీచార్జీలు మాత్రమే..అదే 28 రోజులైతే పదమూడు చేయించాల్సి ఉంటుంది. ఇంటి బడ్జెట్లో ఇప్పుడు మొబైల్ రీఛార్జి అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన ఖర్చుగా మారిపోయింది.ఇదే అదనుగా మొబైల్ సంస్థలు రీఛార్జి ధరలను ఒక్కసారిగా పెంచాయి..ఇప్పుడేంటి పరిస్థితి.. ఏముంది.. ఎంత పెరిగినా గాని.. ఫోన్ వాడకం తప్పదు… భారమైనా..అది ఘోరమైనా..!