జేడీ లక్ష్మీనారాయణ.. సీబీఐలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన అధికారిగా తెలుగు ప్రజలకు బాగా పరిచయమయ్యారు. ఆ తర్వాత స్వఛ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి విశాఖ నుండి ఎంపీగా పోటీచేసి ఓడిపొయారు. ఎన్నికల అనంతరం కొన్ని రోజులకే జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోంచి వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, సినిమాల్లోకి వెళ్లి మాట తప్పారని అంటూ హాట్ టాపిక్ అయ్యారు.
జనసేనకు గుడ్ బై చెప్పిన నాటి నుండి వేరే రాజకీయ పార్టీలో చేరని ఆయన ఈమధ్య వైకాపా వైపు మొగ్గుచూపుతున్నారనే వార్తలు బలంగా వినిపించడంతో మరోసారి చర్చల్లో నిలిచారు. తాజాగా ఒక మీడియా ఛానెల్లో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ పాలన మీద చాలా సధాభిప్రాయంతో మాట్లాడారు. వైఎస్ జగన్ కు తనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, సీబీఐలో ఉండగా డ్యూటీ మాత్రమే చేశానని చెప్పుకొచ్చిన అయన ఒక సందర్భంలో విమానాశ్రయంలో వైఎస్ జగన్ ఎదురుపడితే మర్యాదపూర్వకంగా నమస్కారాలు చేసుకున్నామని అన్నారు.
మరి జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది కదా ఆయన పాలన ఎలా ఉంది అనే ప్రశ్నకు బాగుందని నేరుగా చెప్పలేదు కానీ ఏడాది ముగియడానికి ఇంకా కొన్ని రోజుల టైమ్ ఉంది కదా అది పూర్తయ్యాక చెబుతాను అంటూ జగన్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవెర్చడానికి కృషి చేస్తున్నారని, అది అభినందనీయమని, చాలా మంది మేనిఫెస్టో అంటే ఎనికల్లో గెలవడానికే అనుకుంటారని జగన్ మీద పరోక్షంగానే సదాభిప్రాయాన్ని వెల్లడించారు. దీన్నిబట్టి వైఎస్ జగన్ విషయంలో తనకు పాజిటివ్ ఫీలింగ్ ఉందని చెప్పకనే చెప్పారు.
పైగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే పూర్తిగా వాటికే అంకితం కావాలనేది జేడీగారి అభిప్రాయం. జనసేన నుండి ఆయన బయటికి రావడానికి కూడా అదే పవన్ కు ఆ అంకిత భావం లేదని, తిరిగి సినిమాల్లోకి వెళ్లారనేదే ఆయన ఆరోపణ. ఈ రకంగా చూసుకుంటే వైఎస్ జగన్ కు పార్టీ పట్ల, రాజకీయాల పట్ల పూర్తి అంకిత భావం ఉంది. ఆ భావం జేడీగారికి బాగా నచ్చి ఉండవచ్చు. అదే జగన్ పట్ల ఆయన ఆసక్తి కనబర్చడానికి కారణం. ఇక వేరే పార్టీలో ఎప్పుడు చేరతారనే ప్రశ్నకు కూడా అప్పుడైతే ఒక పార్టీ తన ఆశయాలకి సరైన వేదిక అనిపిస్తుందో అప్పుడు ఆ పార్టీలో చేరతానని అన్నారు. సో.. ప్రజెంట్ ఆయన మనసులో జగన్ మీదే మంచి గురి ఉంది కాబట్టి ఆయన అందులోకే వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.