Jayalalithaa: జయలలిత ఆస్తులు ప్రభుత్వానికే.. మొత్తం వాటి విలువ ఎంతంటే?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయంపై కీలక తీర్పు వెలువడింది. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఈ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక పరిధిలో ఉన్న మొత్తం 1,562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, 10,000 చీరలు, 750 జతల చెప్పులు, వాచ్‌లు తమిళనాడు అధికారుల చేతికి వెళ్లనున్నాయి.

ఇప్పటివరకు ఈ ఆస్తుల అంశం వివాదాస్పదంగా మారింది. దశాబ్దానికి పైగా కొనసాగిన ఈ కేసులో జయలలిత వారసులుగా తమకు హక్కు ఉందంటూ జయదీప, జయదీపక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దీనితో ఆస్తుల స్వాధీనం ప్రక్రియకు మార్గం సుగమమైంది.

2014లో తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లుగా లెక్కించారు. అయితే ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 4,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన అధికార ప్రతినిధులు ఈ ఆస్తులను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పుతో జయలలిత ఆస్తుల వివాదం ఎట్టకేలకు ముగిసినట్టే అని భావిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం భవిష్యత్తులో వీటి వినియోగంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తీర్పు పట్ల జయలలిత అనుచరులు, అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

అఘోరి అంత బోగస్  || Social Activst Krishna Kumari EXPOSED Lady Aghori Naga Sadhu || Telugu Rajyam