తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ తీరుతో జనసేనానికి మంటెక్కిపోతోందిట.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలేదు. బీజేపీతోనో, కాంగ్రెస్ పార్టీతోనో.. ఇవేవీ కాదంటే, అధికార భారత్ రాష్ట్ర సమితితోనో అంటకాగి, ఓ నాలుగైదు సీట్లలో టీడీపీ పోటీ చేసినా, ఆ పార్టీ గౌరవం నిలబడేది.

కానీ, ఈ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వుంటుందేమోనన్న భయంతో, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణలో టీడీపీని దాదాపుగా భూస్థాపితం చేసేశారు. చేస్తే చేశారు.. పోనీ, మిత్రపక్షం జనసేన పార్టీకి అయినా మద్దతు ప్రకటించాలి కదా.?

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జనసేనకు మద్దతిస్తాం, తెలంగాణలో కాదు.. అంటూ మిగిలిపోయిన ఒకరిద్దరు టీడీపీ నేతలు, తెలంగాణలో ఇంకా టీడీపీని నాశనం చేయడానికే అన్నట్లు మాట్లాడుతున్నారు. జనసేనకు టీడీపీ మద్దతివ్వడం వల్ల జనసేనకు అదనంగా కలిసొచ్చేదేమీ వుండదు. టీడీపీ ఓట్లు ఎలాగూ జనసేనకు పడవు. కానీ, ఏదో మాట వరసకి మద్దతు ప్రకటించి వుంటే.. అదో బాండింగ్ వుండేది ఇరు పార్టీల మధ్యా.!

‘జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయ్. అందుకే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీలకు సమదూరంలో వున్నాం..’ అని చెబుతున్నారు తెలంగాణ టీడీపీ నేతలు కొందరు. మరి, బీఆర్ఎస్‌కి దగ్గరగా వున్నారా.? అంటే, అదీ చెప్పడంలేదాయె.

తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తామంటూ జనసేన పార్టీ తెలంగాణ విభాగం ప్రకటించేశాక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అందులో సగం సీట్లలో అయినా పోటీ చేయకపోతామా.? అనుకున్నారు. కానీ, పది పదకొండు దగ్గరే చర్చలు ఆగాయి.. అంతకు మించి ముందుకు కదల్లేదు బీజేపీతో.

ఇంతకీ, పోటీ చేస్తున్న సీట్లలో జనసేన గెలిచే అవకాశం వుందా.? అంటే, ప్చ్.. ఏదీ లేదు. టీడీపీ మద్దతిస్తే మాత్రం, గెలవకపోయినా.. ఓట్లు గౌరవ ప్రదంగా రావొచ్చు జనసేనకి. ఈ విషయంలోనే, టీడీపీ పట్ల జనసేనాని మంటెత్తిపోయి వున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.