తెలంగాణలో డజనుకి పైగా సీట్లలో జనసేన పోటీ.?

‘అన్ని చోట్లా పోటీ చేసేద్దాం..’ అని జనసైనికులు ఉత్సాహ పడుతున్నారు. కాదు కాదు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ.. రెండు చోట్లా జనసైనికుల అత్యుత్సాహం ఇలాగే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ మీద జనసేనాని ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడే, అన్ని సీట్లలోనూ పోటీ చేయడం కుదరడంలేదు జనసేనకి.

తెలంగాణలో పరిస్థితి విషయానికి వస్తే, జనసేన పొలిటికల్ యాక్టివిటీ ఈ మధ్య బాగా పెరిగింది తెలంగాణలో కూడా.! గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఓ ఐదారు చోట్ల జనసేన శ్రేణులు ఒకింత బలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. అంటే, అన్ని చోట్లా జనసేన పోటీ చేసేస్తుందని కాదు లెండి.!

మిత్రపక్షం బీజేపీ దగ్గర ఒకింత గౌరవంగా వుండేందుకోసమే.. ఈ ఏర్పాట్లు అట.! బీజేపీ సాయంతో గ్రేటర్ పరిధిలో ఓ రెండు మూడు చోట్ల పోటీ చేస్తే, ఒక్క చోటన్నా గెలుుపు దక్కకపోతుందా.? అన్న ఆలోచనతో జనసేన వుందట. అయితే, తెలంగాణ బీజేపీ ఏమాత్రం పట్టించుకోవడంలేదు జనసేన పార్టీని.

ఇక, గతంలోనే జనసేనాని చెప్పారు.. ఓ డజను సీట్లలో పోటీ చేద్దామని.! బలం వుంటే, ఇంకాసిని ఎక్కువ సీట్లలోనే పోటీ చేద్దామంటూ తెలంగాణ జనసైనికుల్ని ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ మాటలు పట్టుకుని, ఓ పాతిక ముప్ఫయ్ నియోజకవర్గాల్లో జనసైనికులు చాలా చాలా కష్టపడుతున్నారట.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. వీటికి తోడు మజ్లిస్.. ఇవి కాక, వామపక్షాలు.. ఇంత పొలిటికల్ సందడి వున్న తెలంగాణలో జనసేనని పట్టించుకునేదెవరు.?