పాపం అంబటి రాంబాబు, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కోసం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకోక తప్పలేదు. ‘ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి.. ఆయన (పవన్ కళ్యాణ్) మీద మీకు అభిమానం వుండొచ్చు.. కానీ, నా మీద దయ వుంచి నన్ను గెలిపించండి..’ అంటూ వేడుకున్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఆనాటి ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే వున్నాయి. ఎంతైనా, బులుగు పార్టీ నేత కదా.. అధినేత మెప్పు కోసం జనసేన అధినేత మీద విమర్శలు చేయక తప్పడంలేదు.
నిన్న ‘శతకోటి లింగాల్లో బోడి లింగం..’ అంటూ జనసేన అధినేత చేసిన విమర్శల నేపథ్యంలో, భుజాలు తడిమేసుకుంటూ.. అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలు, పవన్ మీద ఎదురుదాడి చేశారు. అంబటి అయితే, సోషల్ మీడియా వేదికగా ‘వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్!’ అంటూ ట్వీటేశారు. ఇంకేముంది, ‘వచ్చేశాడండీ బోడి లింగం..’ అంటూ జనసైనికులు రివర్స్ ఎటాక్ షురూ చేశారు. అంతేనా, అంబటి ట్వీట్‌ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి, ‘లాయర్ సాబ్ ఈజ్ నాట్ ఫేక్ సాబ్!’ అంటూ ఆయనకే తిప్పి పంపారు. తెలుగు భాషకి వున్న ప్రత్యేకత అదే.
‘వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్!’లో కామా, ఫుల్‌స్టాప్, ఆశ్చర్యార్థకం లాంటివి వాడాల్సిన చోట వాడకపోవడంతోనే ఈ సమస్య వచ్చింది. ఇది, అంబటి అలవాటులో పొరపాటుగా జరిగిందా.? లేదంటే, బులుగు పార్టీకి చెందిన నేత అయినప్పటికీ, జనసేన అధినేత మీద వల్లమాలిన అభిమానంతో, ‘వకీల్ సాబ్, కాదు నకిలీ సాబ్!’ అంటూ ఎలివేషన్ ఇచ్చారనుకోవాలా.? ఒక్క కామా.. అర్థాన్ని ఎలా మార్చేసిందో కదా.! ఎన్నికల్లో తన గెలుపుకు పరోక్షంగా కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇలా తన అభిమానాన్ని అంబటి రాంబాబు తీర్చుకున్నారని కొందరు అంటోంటే, జనసేన అధినేతను విమర్శించబోయి అంబటి, అభాసుపాలయ్యారని మరికొందరు అంటున్నారు.