ఒక్కసారి ఆలోచించండి.దేశ ప్రజలు రాత్రి వేళల్లో గుండెల మీద చేతులు వేసుకుని నిద్రిస్తున్నారంటే సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీరజవానులే కారణం. మంచుతుఫానులు, హిమసునామీలు, నడుస్తున్న బాటలో కనిపించని కందకాలు, తమ దేహాలను తుత్తునియలు గావించే మందుపాతరలు, చాటునుంచి పిడుగుల్లా శత్రువులు కురిపించే తూటాలవర్షాన్ని కూడా లెక్కచెయ్యకుండా, ఉగ్రవాదులు, నరహంతకులు, శత్రుసైనికులతో పోరాడుతూ, అనుక్షణం దేశమాతను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జీవితాంతం తోడుగా ఉండే భార్య, కన్నబిడ్డలు తమ తమ గ్రామాల్లో ఎన్ని ఇక్కట్లు పడుతున్నా చలించక మాతృభూమే తమ కుటుంబంగా భావిస్తూ, ఒక్కోసారి శత్రువుల చేతుల్లో చిక్కుకుని చిత్రహింసలు అనుభవిస్తూ, శత్రుదేశాల జైళ్లలో మగ్గిపోతుంటారు కొందరు సైనికులు. మరికొందరు విదేశీ ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైపోతుంటారు.వారు మరణించిన విషయం ఒక్కోసారి ప్రభుత్వానికి కూడా ఆలస్యంగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా దక్కదు. ఇంత చేసినా, దురదృష్టవశాత్తూ చాలామంది సైనికుల కుటుంబాలు ఆర్ధికంగా చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటాయి.భర్త నెలనెలా భర్త పంపే కొద్దిపాటి డబ్బు కోసం దీనంగా ఎదురు చూస్తుంటాయి.తల్లితండ్రులు మరణించినా, కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైనా వెంటనే వెళ్లి చూడలేని దైన్యస్థితిలో ఉంటారు. ఈ దేశపు జెండా ఆత్మగౌరవాన్ని కాపాడటమే ధ్యేయంగా అన్ని బాధలను గుండెల్లోనే ఇముడ్చుకుని పోరాడతారు. ఒకసారి సైన్యంలో చేరారు అంటే వారు మాతృదేశం కోసం తమను తాము సమిధలుగా అర్పించుకున్నట్లే లెక్క.
అలాంటి సైనిక కుటుంబాలకు సమాజంలో దక్కే గౌరవం చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవు. సైనికుడు మరణించిన తరువాత వారి కుటుంబాలు చాలావరకు వీధులపాలవుతుంటాయి. వారు ప్రదర్శించే ధైర్యసాహసాలకు పురస్కారాలు దక్కుతుంటాయి కానీ ఆర్ధికంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎవరో కొందరు ఆటగాళ్లు ఓ వంద పరుగులు చేశారనో, ఏదో దేశంలో క్రీడల్లో ఒక కాంస్యపథకాన్ని సాధించారనో అదేదో ఘనకార్యంగా ఎంచి వారికి ప్రభుత్వాలు కోట్లాదిరూపాయల నజరానాలు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు పంచేస్తారు మన ప్రభుత్వ సారధులు, ఇరవై ఏళ్ళు నిండకుండానే వారికి పద్మశ్రీలు, భారతరత్నలు కూడా ఇచ్చేస్తారు.మరి మాతృభూమిని ఇరవైనాలుగు గంటలూ రక్షించే వీరయోధులకు అలాంటి గౌరవాలు లభిస్తున్నాయా?
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి చెందిన వీరసైనికులకు అతిగొప్ప కృతజ్ఞతలు ప్రకటించారు. పరమవీరచక్ర, అశోక చక్ర పురస్కారాలు పొందిన వీరులకు అందిస్తున్న ఆర్ధికసాయాన్ని ఏకంగా పదిరెట్లు పెంచడం ..పది లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచడం వారి కుటుంబాలకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు ప్రస్తుతం అందిస్తున్న 6లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని 60 లక్షలకు పెంచింది.
దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరులకు ఎంత ఇచ్చినా తప్పు లేదు.
క్లిష్టమైన ఆర్ధికపరిస్థితుల్లో సైతం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉదారమైన నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయం.
ఒక్క విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అధికారం చెలాయిస్తున్నవారు కూడా తమ అసమర్ధతకు, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులను, వారి పూర్వీకులను కూడా నిందిస్తుంటారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా గత పాలకులను నిందించగా వినలేదు. తాజాగా తమ వీరులను జగన్ గౌరవించుకున్న విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక అభినందనలు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు