అమరావతిపై జగన్‌ సెటైర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

అమరావతిపై జగన్‌ సెటైర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!
తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటించారు. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో.. 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. 2020 ఉగాది సందర్భంగానే ఈ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకున్నామనీ, కానీ కొన్ని రాజకీయ శక్తులు తమ ప్రయత్నానికి అడ్డు తగిలాయనీ, పేదలకు దక్కాల్సిన ఇళ్ళ పట్టాలు దక్కనీయకుండా చేయాలనుకున్నాయనీ ఆరోపించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇళ్ళ పట్టాల విషయమై కోర్టులో వివాదాలు నడిచిన మాట వాస్తవం.
 
అమరావతిపై జగన్‌ సెటైర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!
అమరావతిపై జగన్‌ సెటైర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!
అయితే, వివాదాల్లేని భూముల్ని ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వకుండా ఆపారన్నదానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వుంది. మార్చి 2020 నాటికే ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సి వుండగా, అప్పటికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో భూముల్ని సమీకరించడం ప్రభుత్వానికి కుదరలేదు. దానికి తోడు, అనేక వివాదాలు చుట్టుముట్టాయి. భూ యజమానులు కొన్ని చోట్ల కోర్టులను ఆశ్రయిస్తే, అమరావతి వివాదం, ఆవ భూముల వివాదం.. వెరసి ప్రభుత్వానికి చాలా చిక్కులొచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే, అమరావతిపై వైఎస్‌ జగన్‌, తూర్పుగోదావరి జిల్లాలో కీలక వ్యాఖ్యలు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘రాజధాని అంటే అది అందరిదీ అయి వుండాలనీ.. టీడీపీ హయాంలో రాజధానిని ఆ కోణంలో ఏర్పాటు చేయలేదనీ’ వైఎస్‌ జగన్‌ విమర్శించారు.
 
రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాల్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్‌ జగన్‌. సరే, ఒక రాజధాని అమరావతి వుండాలా.? మూడు రాజధానులు వుండాలా.? అన్నది వేరే చర్చ. కానీ, అమరావతికి ప్రతిపక్ష నేత హోదాలో మద్దతిచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఆ అమరావతిని ఇప్పుడిలా విమర్శించడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రం మధ్యలో రాజధాని వుండాలనీ, అలా జరిగితేనే ప్రాంతీయ విభేదాలు రావనీ అప్పట్లో వైఎస్‌ జగన్‌ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేయాలనుకున్న వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని తప్పు పట్టలేం. అయితే, అమరావతి విషయమై సొంత పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే, మంత్రులు సైతం అమరావతిని స్మశానంగా అభివర్ణిస్తుంటే.. వారినెందుకు ముఖ్యమంత్రి వారించలేకపోతున్నారట.? ఏదిఏమైనా, ఇళ్ళ పట్టాల వ్యవహారంలోకి అమరావతిని వైఎస్‌ జగన్‌ తీసుకురావడం ఖచ్చితంగా ‘రాంగ్‌ టైమింగ్‌’ అనే చెప్పాలి.