ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో జగన్ తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే జగన్ అధికారాన్ని చేపట్టిన ఈ కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైసీపీ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణాలలో మద్యపాన నిషేదం కూడా ఒక కారణం అనే చెప్పాలి.
అయితే వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంచెలంచెలుగా మద్యపాన నిషేదం చేపడతామని చెప్పారు. సరే ఏదైతేనేమి మద్యపాన నిషేదం జరిగితే చాలు అనుకున్న అందరికి ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చిర్రెత్తు తెప్పిస్తున్నాయి. ఈ విషయంలో జగన్ ఏ స్ట్రాటజీ అమలు చేస్తున్నారో తెలియడం లేదు కానీ మద్యపాన నిషేదానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తొలుత కొత్త మద్యం పాలసీనీ తీసుకొచ్చి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలను నిర్వహించేలా చేశాడు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మద్యం దుకాణాలు ఇళ్ళు ఉన్న ప్రదేశాలలోనే పెట్టడంతో అప్పట్లో ప్రభుత్వానికి మహిళల నుంచి ఒకింత నిరసనలు కూడా ఎదురయ్యాయి. ఇక ఆ తరువాత 25 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నా, అంతలోనే కరోనా కారణంగా లాక్‌డౌన్ ఏర్పడింది. ఇక లాక్‌డౌన్ తరువాత జగన్ తీసుకున్న నిర్ణయం మందుబాబుల వెన్నులో వణుకు పుట్టించింది. దాదాపు 75 శాతం మద్యం ధరలు పెంచుతూ, మరో 33 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించారు.
అయితే మద్యం ధరలు భారీగా పెంచడం వలన మద్యాన్ని కొనుగోలు చేయడం తగ్గిస్తారని అలా మెల్ల మెల్లగా మద్యం అలవాటు కూడా తగ్గిస్తారని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి క్షేత్ర స్థాయిలో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏపీలో ధర ఎక్కువ అని పక్క రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించుకుని మరీ తాగుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవల మద్యం దుకాణాలు మరో గంట పాటు ఎక్కువ సమయం తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది జగన్ సర్కార్.
ప్రస్తుతం వైన్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాల్సి ఉన్నా దానిని మరో గంట పాటు పొడిగించి 9 గంటల వరకూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదం అని ఇలా ఎక్కువ సేపు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం ఏమిటీ అని అటు ప్రతిపక్షాలు, ఇటు మహిళలు కూడా ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం జగన్ చెప్పిందొకటి, చేస్తుందొకటి అన్నట్టుగా ఉందని పలువురు విశ్లేషకుల వాదన.