వైఎస్ జగన్ మార్కు సంక్షేమం.. ఇదెందుకు లెక్కల్లోకి రావట్లేదు.?

Jagan Must Focus On Development..

Jagan Must Focus On Development..

సంక్షేమ పథకాలు అధికారంలో వున్న పార్టీలకు ప్రధాన అస్త్రాలు.. అయితే, అవి ప్రచారం కోసం మాత్రమే పనికొస్తాయి. సంక్షేమ పథకాలకి ఓట్లు రాలే రోజులెప్పుడో పోయాయ్.. అంటారు రాజకీయ విశ్లేషకలు. అది నిజమేనా.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి. గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో సరికొత్త సంక్షేమ పథకాల్ని తెరపైకి తెచ్చింది.

క్యాలెండర్ ప్రకారం, దాదాపుగా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని కొత్తగా ప్రజల ముందుకు తీసుకెళుతోన్న విషయం విదితమే. 80 శాతానికి పైగా కుటుంబాలకు ప్రత్యక్షంగా సంక్షేమ పథకాలతో లబ్ది జరుగుతోందన్నది వైసీపీ ప్రభుత్వం కుండబద్దలుగొట్టి చెబుతున్న విషయం. నిజానికి, సంక్షేమం.. అన్ని కొత్త వ్యవహారం కాదు. కేంద్ర, రాష్రట ప్రభుత్వాలు ఎప్పటినుంచో చేస్తున్నవే. కానీ, సంక్షేమాన్ని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త పుంతలు తొక్కిస్తే.. అంతకు మించిన స్థాయిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాల జోరుతో హోరెత్తిస్తున్నారు. రెండేళ్ళ పాలన పూర్తయ్యింది.. మరో మూడేళ్ల పాలన మిగిలి వుంది.

ఈలోగా జమిలి ఎన్నికలొస్తే పరిస్థితి ఏంటి.? జమిలి ఎన్నికలొచ్చినా సరే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ చెబుతోంది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితమే దానికి నిదర్శనమని అంటోంది. అయితే, తెల్లనివన్నీ పాలు కాదనే వాస్తవాన్ని అధికార వైసీపీ గుర్తెరగాల్సి వుంది. సంక్షేమ పథకాల అమలు అనేది కత్తి మీద సాములాంటి వ్యవహారమే. సంక్షేమానికి కేటాయింపులు అదరహో.. అన్నట్టే వుంటున్నా, అభివృద్ధి మాత్రం కనిపించడంలేదు.

రెండేళ్ళ పాలన తర్వాత రాష్ట్రంలో ఏం కొత్తగా వచ్చింది.? అంటే, ఏమీ చూపించుకోలేని పరిస్థితి ప్రజలది. కీలకమైన రంగాల్లో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకీ, వాస్తవ పరిస్థితులకీ చాలా తేడాలున్నాయి. వీటి గురించిన చర్చ మొదలైతే, సంక్షేమం అనేది చాలా చిన్న విషయంగా మారిపోతోంది. అందుకే, జగన్ నెలలో రెండు మూడు సార్లు.. ఆయా సంక్షేమ పథకాల పేర్లతో ప్రకటనలు ఇప్పించుకుంటున్నా.. మరుసటి రోజుకే ఆ విషయాల్ని జనం మర్చిపోతున్నారు.