(యాత్ర స్పెషల్-3) జగన్ చాలా తొందరగా నేర్చుకున్నవిషయం ఇది…

(యనమల నాగిరెడ్డి)

“మొక్కవోని పట్టుదల. అంతులేని ఆత్మవిశ్వాసం. అకుంఠిత దీక్షా – దక్షత. కష్టనష్టాలకు తట్టుకునే మొండి  గుండె ధైర్యం. దగ్గరకు వచ్చిన వారిని ఆత్మీయంగా పలుకరించే ప్రేమ. ఎండకు ఎండి , వానకు తడిసి పల్లెలను, పట్టణాలను పలుకరిస్తూ, వంకలు, వాగులు  దాటుకుంటూ తన గమ్యం వైపు సాగుతున్న నిరంతర బాటసారి వై .ఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి వై .ఎస్.జగన్మోహన్ రెడ్డి”. ఇది మూడుముక్కల్లో జగన్ గురించి చెప్పాలంటే.

కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద 2017 నవంబర్ లో జగన్ ప్రారంభించిన పాదయాత్ర రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. దాదాపు 14 నెలలపాటు 3450 కిలోమీటర్లు సాగిన  ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఆయన 13 జిల్లాలు చుట్టి సుమారు 130కి పైగా నియోజకవర్గాలు, వందలాది మండలాలు, గ్రామాలను పలకరిస్తూ జగన్ యాత్ర సాగించారు. ఈ యాత్రలో వెలాది మందిని ఆయన పలుకరించారు. లక్షలాది మందిని వెంట నడిపించుకున్నారు.   అంతకు ముందు కూడా ఆయన “ఓదార్పు యాత్ర, గర్జన,సదస్సులు” లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నిరంతరం జనం తో మమేకం కావడానికి యత్నించారు. ఈరోజు ఆయన యాత్ర ముగుస్తున్నది. ఈ యాత్రలన్నీ రాజకీయంగా జగన్ కు బాగానే ఉపయోగపడతాయనక తప్పదు. ఎపుడూ ప్రజల మధ్య ఉండటానికి మించిన ఉద్యమం లేదని  జగన్ 2014లో  ఓటమి వెన్వెంటనే తెలుసుకున్న సత్యంలా కనబడుతుంది. అందుకే అప్పటి నుంచి ఆయన ఏదో ఒక నినాదంతో జనం మధ్యనే ఉంటున్నారు.

వై ఎస్  వారసుడిగా…

ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి గా ఉన్న సమయంలో ఆయన ముద్దుల కొడుకుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి  తండ్రి చాటు బిడ్డగా తండ్రిని అడ్డంపెట్టుకొని తన రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కొంత మేరకు అనుచరగణాన్ని(భజన పరులను) , భక్త బృందాన్ని తయారు చేసుకున్నారు. తానే  తిరుగులేని శక్తి గా భావించి తీవ్ర అహంకారంతో అధికారం చెలాయించారని ఆరోపణలున్నాయి.

రాజశేఖర్ రెడ్డి  అకస్మాత్తుగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో “ఆశల పల్లకిలో ఆకాశంలో విహరిస్తున్న జగన్ ఒక్కసారిగా భూమి మీదకు రాక తప్పలేదు.  ఆ సమయంలో కొందరు “అంతేవాసులు” వై ఎస్ వారసుడిగా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాల సేకరణ చేయడం జరిగింది. అదే సమయంలో వై ఎస్  హఠాన్మరణం వార్తా విని తట్టుకోలేక (అనేక మంది) ప్రజలు చనిపోవడం జరిగింది.

ఓదార్పు యాత్ర…

వారసత్వంగా ఆశించిన ముఖ్యమంత్రి పదవి దక్కక పోవడంతో ఆయన  తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా పలకరించాలని నిర్ణయించారు. అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఇందుకు వ్యతిరేకించినా వినకుండా  “ఓదార్పు యాత్రల పేరుతొ” తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రమంతా అలుపెరగకుండా తిరిగారు. తన తండ్రి వారసత్వంగా ఇచ్చిన రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి, ప్రజలను ముఖాముఖీ కలవడానికి ప్రయత్నించి విజయం సాధించారు. కాంగ్రెస్ ను ఎదిరించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, తనతో పాటు వెంట వచ్చిన ఎంఎల్ ఏ లను రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించి పెట్టారు.  కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి, అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవడం, కేసులలో ముద్దాయిగా మారడం, సుదీర్ఘ జైలు జీవితం అనుభవించడం తో పాటు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు చరిత్ర.

రాష్ట్ర విభజన తర్వాత

రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో జగన్ అతి తక్కువ తేడాతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోలేక పోయారు. ఆయన ఎన్నికలకు ముందు సమైక్యతా  రాగం ఆలపించినా, ఆయన తండ్రి ద్వారాను, తనంతకు తాను జనంలో సాధించుకున్న విశేషాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయ చతురత జగన్ ను దెబ్బ తీసిందని చెప్పక తప్పదు.

జగన్ అప్పటి నుండి  జనంలోనే

సాధారణంగా ఎన్నికల తర్వాత నాయకులు విస్రాంతి  తీసుకుంటారు. తిరిగి ఎన్నికల ముందు వరకు తమ స్వంత  పనులపై నిమగ్నమై ఎన్నికలు దగ్గ్గర పడిన సమయంలో తమ ఆయిదాలతో విజృంభించి జనంలోకి వెళతారు. ఐతే  వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికలు పూర్తి అయినప్పటి నుండి ఎదో ఒక కార్యక్రమం చేపట్టి నిరంతరం ప్రజలలో ఉండడానికే ప్రాధాన్యమిచ్చారు.  జనంతో ఉండడమే ఒక యజ్ఞం లాగా యాత్రలు, సదస్సులు, గర్జనలు నిర్వహించారు . అందులో భాగంగా ఆయన రెండవ విడత ఓదార్పు యాత్ర చేయడం, విభజన హామీలు సాధించుకోవడం కోసం సదస్సులు, భహిరంగ సభలు నిర్వహించడం చేశారు.

ప్రస్తుతం సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి గత 14 నెలలుగా జనంతోనే ఉన్నారు. ఇడుపులపాయలో చిన్న పిల్ల కాల్వలా  ప్రారంభమైన ఈ యాత్ర చివరకు మహా ప్రభంజనంలా మారింది. ఇందువల్ల జగన్ జనాన్ని స్వయంగా కలుసుకొని వారి కష్ట నష్టాలు దగ్గరగా తెలుసుకోడానికి వీలైంది. అలాగే సామాన్య జన జీవనాన్ని, ప్రజల ఇబ్బందులను, నిరుపేద ప్రజల ఆక్రందనలను స్వయంగా చూడగలిగారు. వినగలిగారు కూడా. ప్రజల కష్టాల పట్ల, వారి ఆశల పట్ల జగన్  స్పందనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ను దగ్గరగా చూడాలనుకొని వీలుండి  కూడా సెక్యూరిటీ కారణాలతో చూడలేకపోయిన సాధారణ ప్రజలు, పార్టీకి చెందిన రెండవ శ్రేణి నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యారని తెలుస్తున్నది.    ఏది ఏమైనా జగన్ సుదీర్ఘ పాదయాత్ర జనాన్ని కదలించడంలో విజయం సాధించిందని చెప్పక తప్పదు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ కష్టాన్ని, జనంలో కలిగించిన నమ్మకాన్ని,జనానికి ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని నియోజకవర్గ నాయకులు ఎంత మాత్రం “ఒట్లుగా” మార్చగలరో ఎన్నికలే తెలుస్తాయి.

ఎన్నికల ముగిసినప్పటి నుండి  (ఎదో ఒక పేరుతొ) జనం లోనే ఉన్న జగన్ కు ప్రజలు పట్టం కడతారా? లేక నిరంతరం  పత్రికలలో కన్పిస్తూ మరో రకంగా జనంలో ఉన్న చంద్రబాబు (40 సంవత్సరాల ఇండస్ట్రీ) కు పట్టం కడతారా? వేచి చూడాల్సిందే.