2019 ఎన్నికల్లో అత్యధిక సీట్ల గెలుపుతో కంచు కోటలాగా పటిష్టమైన స్థితిలో ఉన్న వైసిపిలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి రగులుతోందా?…అంటే అవుననేలా ఇటీవల పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అనేక నియోజక వర్గాల్లో వైసిపి నేతల మధ్య వర్గ పోరు పెరిగి బహిరంగ విమర్శలకు దిగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మొదట్లో చాలా అరుదుగా ఎవరో ఒక సీనియర్ నాయకుడు మాత్రమే తన అసమ్మతిని వెలిబుచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఓ మోస్తరు నాయకులు సైతం పార్టీ నేతలపై, ఎమ్మెల్యేలు,మంత్రులపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇక ఉపేక్షిస్తే నష్టమని భావించి జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారంటున్నారు. వీటినే జగన్ అభిమానులు ముద్దుగా ‘జగన్ గ్యారేజ్’ రిపేర్లు మొదలయ్యాయని చెప్పుకొని మురిసిపోతున్నారు.
మొదట్లో అంతా గప్ చుప్
జగన్ ముఖ్యమంత్రిగా 2019 మే 30 న వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కాలం వరకు వైసిపిలో అసమ్మతి రాగాలు ఎక్కడా వినిపించలేదు. ఒకే నియోజకవర్గంలో ఒకరిపొడ మరొకరికి గిట్టని ప్రత్యర్థుల వంటి నేతలు ఉన్నా ఒకరి మీద ఒకరు విమర్శలు చేయడం వంటివి ఉండేవి కాదు. అయితే ఆ స్థితి నుంచి క్రమంగా కాలం గడిచేకొద్దీ పరోక్ష విమర్శలు, ఎత్తిపొడుపులుతో అడపాదడపా అక్కడోనాయకుడు ఇక్కడో నాయకుడు ఆక్రోశం వెలిబుచ్చుతుండగా ఏ పార్టీలోనైనా ఆ మాత్రం అసమ్మతి గళాలు సహజమేనని పట్టించుకోలేదు. అయితే క్రమంగా ఆ అసమ్మతి గళాలు అంతకంతకు పెరిగిపోతూ చివరకు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకునేంతవరకు పరిస్థితి వెళ్లింది.
చాలా కాలం ఉదాసీనమే
అయితే ఈ అసమ్మతి రాగాలపై పై దృష్టి సారించి ఇరువురు నాయకులతో చర్చించి సఖ్యత కుదర్చడం వంటి చర్యలకు వైసిపి అధినేత జగన్ ఉపక్రమించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో ఆయా చోట్ల అవి మరింత ముదురుతుండగా వాటి ప్రభావంతో అనేక చోట్ల అసంతృప్తి గళాలు విప్పి తోటి నేతలపై విమర్శలు, ఫిర్యాదులు చేసేవారు ఎక్కువయ్యారు. ఒకరకంగా నెల్లూరులో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇలాంటి అసంతృప్తి రాగం మొదలెట్టగా ఆ తరువాత నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు ఏకంగా ప్రభుత్వంపైనే ఘాటైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తున్నారు. అదే కోవలో విజయనగరం,చీరాల, సత్తెనపల్లి,తిరుపతిల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా ఫిర్యాదులు చోటుచేసుకున్నాయి.
నెల్లూరు నుంచే ఆరంభం
దీంతో ఇక ఉపేక్షించడం సరికాదని, అది భారీ నష్టానికే దారి తీయొచ్చని భావించిన అధినేత జగన్ ఈ విమర్శలు తొలుత ఎక్కడనుండి ప్రారంభమయ్యాయో అదే చోటు నుంచి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారట. నెల్లూరులో సుదీర్ఘకాలంగా రాజకీయ ఆధిపత్యం రెడ్డి సామాజిక వర్గం నేతల్లోనే ఉంటూవస్తోంది. అయితే ప్రత్యర్థులు రెడ్డి పార్టీగా అభివర్ణించే వైసిపి హయాంలో నెల్లూరు జిల్లాలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే సామాజిక వర్గానికి పవర్ అప్పచెప్పడంపై అక్కడి సీనియర్ నేతలు భగ్గుమంటున్నారట. దీంతో ఈ అసమ్మతి మంటలను చల్లార్చటానికి సిఎం జగన్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి బాధ్యత అప్పగించారని తెలిసింది. దీంతో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, నాయకులను నేరుగా కలసి మీకు ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని పనులు చేసిపెట్టే బాధ్యత నాదని, మన పార్టీకి మనం నష్టం చేసుకోవద్దని ఆయా నేతలను గాడిలో పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే తరహాలో అన్ని చోట్లా ‘జగన్ గ్యారేజ్‘ రిపేర్లు ఉంటాయని వైసిపి అభిమానులు సంబరపడుతున్నారు.