IT Raids: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, DSR గ్రూప్‌పై ఐటీ పంజా

మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త గడ్డం రంజిత్ రెడ్డి, ఆయన భాగస్వామిగా ఉన్న DSR కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న పక్కా సమాచారంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో 30 ప్రాంతాల్లో సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది. పన్ను ఎగవేత ఆరోపణలు.. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు.

వివరాల్లోకి వెళితే….DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు DSR గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డిలకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారం సహా పలు కీలక ప్రాంతాల్లో CRPF బలగాల భారీ భద్రత నడుమ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

కీలక ప్రాజెక్ట్‌పై దృష్టి: ఐటీ అధికారులు ప్రధానంగా ఫిలింనగర్‌లో DSR గ్రూప్ నిర్మిస్తున్న “DSR The World” ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 14.45 ఎకరాల విస్తీర్ణంలో 9 టవర్లతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్లుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

DSR కంపెనీ ఇప్పటివరకు 34 భారీ ప్రాజెక్టులను నిర్మించినట్లు గుర్తించిన అధికారులు, సోదాల్లో భాగంగా వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీలు మరింత కొనసాగే అవకాశం ఉందని, పూర్తి వివరాలు సోదాల అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

మార్వాడీలు గో బ్యాక్ || Analyst Chitti Babu Reacts On Marwadi Go Back Controversy || Telugu Rajyam